యస్ బ్యాంక్ కుంభకోణం.. వాధ్వాన్ సోదరుల అరెస్ట్

ABN , First Publish Date - 2020-04-27T01:26:40+05:30 IST

యస్ బ్యాంకు కుంభకోణంలో పాత్రధారులగా భావిస్తున్న డీహెచ్ఎఫ్ఎల్‌కు చెందిన ధీరజ్, కపిల్

యస్ బ్యాంక్ కుంభకోణం.. వాధ్వాన్ సోదరుల అరెస్ట్

ముంబై: యస్ బ్యాంకు కుంభకోణంలో పాత్రధారులగా భావిస్తున్న డీహెచ్ఎఫ్ఎల్‌కు చెందిన ధీరజ్, కపిల్ వాధ్వాన్‌లను ఆదివారం సీబీఐ అరెస్ట్ చేసింది. మహాబలేశ్వర్‌లోని వారి బంగళాలో అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. రేపు (సోమవారం) వారిని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీ కోరనుంది. వీరిద్దరితోపాటు కుటుంబ సభ్యులు ఈ నెల 23 వరకు 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు సీబీఐ తెలిపింది.


మహాబలేశ్వర్‌లో విహారానికి వచ్చిన వీరిపై సీబీఐ ఇటీవల అరెస్ట్ వారెట్ జారీ చేసింది. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయవద్దన్న లాయర్ విజ్ఞప్తితో ఏప్రిల్ 18న అరెస్ట్‌పై కోర్టు స్టే విధించింది. మే 5 వరకు వారిని అరెస్ట్ చేయకుండా కోర్టు స్టే ఉపశమనం కల్పించింది. 


అయితే, అరెస్ట్ వారెంట్‌ను ఎత్తివేయాల్సిందిగా కోరుతూ ప్రత్యేక కోర్టును సీబీఐ ఆశ్రయించడంతో శనివారం వాధ్వాన్ల స్టేను రద్దు చేసింది. దీంతో శనివారం మధ్యహ్నం ముంబై నుంచి సీబీఐ బృందం సతారా చేరుకుని వారిని అరెస్ట్ చేసినట్టు సీబీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరినీ ముంబై తరలించనున్నట్టు పేర్కొంది. వాధ్వాన్ల అరెస్ట్‌ను మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ధ్రువీకరించారు. 

 

సీబీఐ ఎఫ్‌ఆర్ ప్రకారం.. 2018 ఏప్రిల్-జూన్ మధ్య యస్ బ్యాంకు రూ.3,700 కోట్లను స్వల్పకాలిక డిబెంచర్ల కింద దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్‌ఎల్)లో పెట్టుబడిగా పెట్టింది. దీనికి ప్రతిగా వధవాన్లు రూ.600 కోట్లను కపూర్ ఆయన కుటుంబ సభ్యులకు డొయిట్ అర్బన్ వెంచర్స్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్‌లో రుణం రూపంలో చెల్లించినట్టు సీబీఐ ఆరోపించింది. 


వాధ్వాన్ సోదరులను అరెస్ట్ చేసేందుకు మార్చి 17న సీబీఐ నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పొందింది. ఏప్రిల్ 9న వాధ్వాన్ సోదరులు మొత్తం 23 మందితో కలిసి లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి మరీ ఖండాల నుంచి మహాబలేశ్వర్ విహారయాత్రకు వెళ్లారు. ఇందుకోసం వీరు హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి నుంచి పాస్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత వీరిని అధికారులు హోం క్వారంటైన్ చేశారు. 

Updated Date - 2020-04-27T01:26:40+05:30 IST