కరోనా రికవరీ రేటు 60.80 శాతం

ABN , First Publish Date - 2020-07-05T21:06:41+05:30 IST

కరోనా కేసుల సంఖ్య ఓవైపు పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా..

కరోనా రికవరీ రేటు 60.80 శాతం

న్యూఢిల్లీ: కరోనా కేసుల సంఖ్య ఓవైపు పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 24,850 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 613 మంది మృతువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,73,165కు చేరింది. ఇందులో 2,44,814 యాక్టివ్ కేసులు కాగా, 4,09,083 మంది పూర్తిగా కోలుకున్నారు. పేషెంట్ల రికవరీ 60.80 శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా పడిన మహారాష్ట్రలో కేసుల సంఖ్య 1,92,990కి చేరింది. 8,376 మంది మృత్యువాత పడ్డారు. కాగా, జూలై 3 వరకూ 95,40,132 శాంపుల్స్ పరీక్షించగా, శనివారం ఒక్కరోజే 2,42,383 శాంపుల్స్ పరీక్షించినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.


కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీలో...

కర్ణాటకలో ఆదివారంనాడు 1,838 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 21,549కు చేరింది. గత 24 గంటల్లో 42 మరణాలతో కలిపి మొత్తం 335 మంది ఇంతవరకూ మృతి చెందారు. రాజస్థాన్‌లోనూ 480 కొత్త కేసులతో కలిపి మొత్తం 19,532 కేసులు నమోదయ్యాయి. కొత్తగా ఏడుగురు మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 447కు చేరింది. ఢిల్లీలో సైతం ఆదివారంనాడు రికార్డు స్థాయిలో 2,505 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 97,200కు చేరింది. అయితే, తొలిసారి రికార్డు స్థాయిలో రికవరీ రేటు 70 శాతానికి పెరిగింది.

Updated Date - 2020-07-05T21:06:41+05:30 IST