పోలీస్ ఫోర్స్‌లో కరోనా రికవరీ రేటు 60 శాతం

ABN , First Publish Date - 2020-05-25T00:06:37+05:30 IST

కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గత 15 రోజుల్లో రెట్టింపైంది. ఈ సంఖ్య ప్రస్తుతం..

పోలీస్ ఫోర్స్‌లో కరోనా రికవరీ రేటు 60 శాతం

న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్) కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గత 15 రోజుల్లో రెట్టింపైంది. ఈ సంఖ్య ప్రస్తుతం 1,180కి చేరింది. అయితే, 60 శాతం మందికి స్వస్థత చేకూరడం విశేషం. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఆర్‌పీఎప్‌ వంటి బలగాల్లో గత పది రోజుల్లో కరోనా వ్యాప్తి రికార్డు స్థాయిలో తగ్గింది.


బీఎస్ఎఫ్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. 400కు పైగా కేసులు నమోదు కాగా, అందులో 120 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య రెండుగా ఉంది. బీఎస్ఎఫ్ గణాంకాల ప్రకారం, మే 24 వరకూ 286 మందికి స్వస్థత చేకూరింది. ఇదేవిధంగా, సీఆర్‌పీఎఫ్‌లో ఏప్రిల్‌లో కేసులు బాగా పెరిగాయి. మొత్తం 359 కేసులు నమోదు కాగా, 220 మంది జవాన్లు పూర్తిగా కోలుకున్నారు. ఇద్దరు మృతి చెందారు. కొద్దిరోజుల క్రితం ఒక జవానుకు కరోనా పాజిటివ్ రావడంతో, సీఆర్‌పీఎప్ ప్రదాన కార్యాలయాన్ని మూసేశారు.


దేశవ్యాప్తంగా విమానాశ్రయాల వద్ద మోహరించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు సంబంధించి 184 కరోనా కేసులు నమోదు కాగా, 116 మందికి స్వస్థత చేకూరింది. ఎక్కువ సంఖ్యలో ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో మొహరించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది కరోనా వైరస్ బారినపడగా, కోల్‌కతా, తమిళనాడు, హైదరాబాద్‌లో కొద్ది కేసులు నమోదయ్యాయి.


ఇండో టిబెట్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ) నుంచి ఇంతవరకూ 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 121 మంది పూర్తి స్వస్థతతో డిశ్చార్జి అయ్యారు. ముఖ్యంగా ఢిల్లీ, పరిసరాల్లోని హాట్‌స్పాట్‌ల వల్ల విధి నిర్వహణలో ఉన్న ఎక్కువ మంది ఐటీబీపీ సిబ్బంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. సహస్ర సీమా బల్ (ఎస్ఎస్‌బి)కి చెందిన 41 పాజిటివ్ కేసులకు గాను, తొమ్మిది మంది ఇప్పటికే డిశ్చార్జి అయ్యారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ‌నుంచి కేవలం ఒకే కేసు నమోదు కావడం రికార్డు. 

Updated Date - 2020-05-25T00:06:37+05:30 IST