15 రోజులు.. అంతే.. అప్పుడు డిసైడ్ చేద్దాం: ట్రంప్

ABN , First Publish Date - 2020-03-24T02:16:03+05:30 IST

కరోనా మహమ్మారి తెచ్చిపెట్టిన ఆర్థిక మందగమనం తన సహనాన్ని పరీక్షిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.

15 రోజులు.. అంతే.. అప్పుడు డిసైడ్ చేద్దాం: ట్రంప్

వాషింగ్టన్: కరోనా మహమ్మారి తెచ్చిపెట్టిన ఆర్థిక మందగమనం తన సహనాన్ని పరీక్షిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా కట్టడికి అవసరమైన క్వారంటైన్ వంటి పరిష్కారాలు అసలు సమస్య కంటే దారుణంగా ఉన్నాయన్నారు. వీటి వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.


‘సమస్య కంటే దాని పరిష్కారమే దారుణంగా మారిపోయే పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు. ఈ పదిహేను రోజుల గడువు తరువాత మనం ఏ దిశలో ప్రయాణించాలనే దానిపై ఓ నిర్ణయానికి వద్దాం’ అని ట్వీట్ చేశారు. ట్రంప్ ప్రస్తావించిన 15 రోజుల వ్యవధి అమెరికాలో గత వారం ప్రారంభమైంది. ఈ సమయంలో కరోనా కట్టడికి అమెరికా ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని సూచించింది. అయితే ఈ చర్యలు దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసి ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ‘పది హేను రోజులు.. అంతే. ఆ తరువాత అధిక రిస్క్ ఉన్న వాళ్లను జాగ్రత్తగా ఓ పక్కన పెట్టి మిగిలిన మనం పనిలోకి దిగిపోదాం. అందరం మునిగిపోయే లోపలే ఓ నిర్ణయం తీసుకుందాం’ అని ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యను కూడా ట్రంప్ రీట్వీట్ చేశారు.

Updated Date - 2020-03-24T02:16:03+05:30 IST