భారత ఆర్మీలో ఒంటెల ఉద్యోగం..!

ABN , First Publish Date - 2020-09-23T00:33:08+05:30 IST

చైనా సరిహద్దుల్లో సైన్యమే కాదు.. భారత ఒంటెలు కూడా కాపలా కాయనున్నాయి. నమ్మడం లేదా..? నిజమండీ బాబు..! భారత ఆర్మీ తరపున..

భారత ఆర్మీలో ఒంటెల ఉద్యోగం..!

చైనా సరిహద్దుల్లో సైన్యమే కాదు.. భారత ఒంటెలు కూడా కాపలా కాయనున్నాయి. నమ్మడం లేదా..? నిజమండీ బాబు..! భారత ఆర్మీ తరపున కిలోమీటర్ల కొద్దీ బరువులు మోసుకుంటూ తిరిగేందుకు అనువుగా.. డబుల్‌ హంప్‌డ్‌ క్యామెల్స్‌ను సరిహద్దుల్లో గస్తీకి ఆర్మీ వినియోగించనుంది. దీంతో ఆర్మీలో ఒంటెలకు కూడా కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ విషయాన్ని భారత ఆర్మీనే స్పష్టం చేసింది. లేహ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూట్‌ రీసెర్చ్‌ ఆధీనంలో ఈ ఒంటెలు సేవలందించనున్నాయి. ఇంతకీ ఈ ఒంటెలను దేనికి ఉపయోగిస్తారబ్బా అని అనుమానపడుతున్నారా..? సరిహద్దుల్లో గస్తీ తిరగడానికండీ. మరీ ముఖ్యంగా చైనా సరిహద్దుల్లోనే వీటికి ఎక్కువ పని ఉంటుంది.


లద్దాఖ్‌ తూర్పు ప్రాంతం ఎక్కవగా కొండలు, గుట్టలతో ఎత్తుగా ఉంటుంది. ఈ ప్రాంతంలో బరువైన సామగ్రిని తీసుకుని వెళ్లడం సైన్యానికి పెను సవాల్‌గా ఉంటుంది. దీనిని అధిగమించేందుకే ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంది. రెండు మూపురాలు ఉన్న ఒంటెలు బలంగా ఉండడమే కాక ఎక్కువ బరువును సైతం మోయగలవు. దాదాపు 170 కిలోల బరువును మోస్తూ 12 కిలోమీటర్ల వరకు ఇవి ప్రయాణించగలవు. దీంతో చైనా సరిహద్దుల్లో గస్తీ సమయంలో వీటిని ఉపయోగిస్తే సైన్యానికి భారం తగ్గుతుంది.


సైన్యానికి అందించనున్న ఒంటెలపై ప్రస్తుతం డీఆర్‌డీవో పరిశోధన చేస్తోంది. ఇవి ఎంతవరకు ఆర్మీకి ఉపయోగపడగలవు..? ఒంటెల వినియోగంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా..? అనే కోణంలో శాస్త్రవేత్లు పరిశోధన చేస్తున్నారు. సాధారణ ఒంటెలు కూడా బరువులను మోయగలిగినప్పటికీ.. లద్దాఖ్‌ ప్రాంతంలో ఉండే చలిని అవి తట్టుకోలేవు. అందుకే ఇక్కడి వాతావరణానికి సరిపోయే రెండు మూపురాల ఒంటెలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.


రవాణాకు లద్దాఖ్‌ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే వీటి సంఖ్య ప్రస్తుతం తక్కువగా ఉంది. దీంతో ఈ ఒంటెల సంతతిని పెంచి.. అనంతరం వాటిని ఆర్మీకి అందించనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పటివరకు వీటి పర్యవేక్షణ సైన్యం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా లద్దాఖ్‌లోని లేహ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూట్‌ రీసెర్చ్‌ వీటిని సంరక్షించనుంది. అంటే త్వరలో చైనాపై మన ఒంటెలు కూడా దండెత్తనున్నాయన్న మాట..!

Updated Date - 2020-09-23T00:33:08+05:30 IST