ఫైజర్ టీకా తీసుకున్న నర్సుకు కరోనా కాటు..!

ABN , First Publish Date - 2020-12-30T20:32:06+05:30 IST

ఫైజర్ కరోనా టీకా వేయించుకున్న వారం తరువాత ఓ నర్సు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.

ఫైజర్ టీకా తీసుకున్న నర్సుకు కరోనా కాటు..!

కాలిఫోర్నియా: ఫైజర్ కరోనా టీకా వేయించుకున్న వారం తరువాత ఓ నర్సు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు. అమెరికాలోని  క్యాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మాథ్యూస్.డబ్యూ స్థానికంగా ఉన్న రెండు ఆస్పత్రుల్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే..డిసెంబర్ 18న ఆయన ఫైజర్ కంపెనీ తయారు చేసిన కరోనా టీకా తొలి డోసును తీసుకున్నారు. చేతిపై టీకా వేయించుకున్న ప్రాంతం కొద్దిగా ఎర్రబడటం తప్ప తనకు ఇతర ఇబ్బందులూ కలగలేదని మాథ్యూస్ తెలిపారు. 


ఇది జరిగిన ఆరు రోజుల తరువాత అంటే..క్రిస్మస్ సందర్భగా..విధుల్లో ఉన్న తనకు అనారోగ్యంగా అనిపించిందని..ఆ తరువాత కొద్ది సేపటికే చలి, ఒళ్లునొప్పులు వచ్చాయని ఆయన తెలిపారు. మరుసటి రోజు మ్యాథ్యూస్ కరోనా టెస్టు చేయించుకోగా..రిపోర్టుల్లో పాజిటివ్ అని తేలింది. అయితే..ఇటువంటి ఘటన అనూహ్యమైనదేమీ కాదని స్థానిక అంటువ్యాధుల నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. ‘క్లినికల్ ట్రయల్స్‌లో తెలిసిందేంటంటే..టీకా తీసుకున్న 10 నుంచి 14 రోజుల తరువాతే  మన రోగనిరోధక శక్తి(ఇమ్యునిటీ) కరోనాను ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నధ్దమవడం ప్రారంభిస్తుంది. తొలి డోసు తీసుకున్నాక..మనలో ఇమ్మునిటీ 50 శాతం సామర్థ్యాన్ని..రెండు డోసు తరువాత 95 శాతం శక్తిని సంతరించుకుంటుంది’ అని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో కరోనా టీకా తీసుకున్నాక కొంతకాలం పాటు భౌతిక దూరం పాటించడం, మాస్క ధరించడం వంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-12-30T20:32:06+05:30 IST