రోగులకు ఆత్మ బంధువుగా మారిన క్యాబ్ డ్రైవర్ మంజునాథ్

ABN , First Publish Date - 2020-05-18T02:14:39+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వల్ల అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులు,

రోగులకు ఆత్మ బంధువుగా మారిన క్యాబ్ డ్రైవర్ మంజునాథ్

బెంగళూరు : కోవిడ్-19 మహమ్మారి వల్ల అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులు, వారి బంధువులు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అలాంటి సమయంలో క్యాబ్ డ్రైవర్లు మానవతా దృక్పథంతో వారికి అండగా నిలుస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి సేవలందించడం వల్ల సంతృప్తి కలుగుతోందని, వారి ఆశీర్వాదాలు కూడా లభిస్తున్నాయని డ్రైవర్లు సంతోషిస్తున్నారు. 


ఎస్ మంజునాథ్ రావు 19 ఏళ్ల నుంచి కారు డ్రైవర్‌గా చేస్తున్నారు. ఆయన ఇటీవల తన కారులో  అనేక మంది రోగులను అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు  చేర్చారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన ఓ రోగిని ఆయన ఓ ఆసుపత్రికి కారులో తరలించారు. అక్కడ ఆ రోగి భార్య, కుమారుడు మాత్రమే ఆ రోగితో పాటు ఉన్నారు. వారి పరిస్థితిని చూసి, చలించిపోయిన మంజునాథ్, వారితోపాటు అక్కడే ఉన్నారు. డాక్టర్లు, నర్సులు వచ్చి, ఆ రోగికి సపర్యలు చేసి, సాధారణ స్థితికి తీసుకొచ్చే వరకు సాయపడ్డారు. అనూహ్యంగా ఓ డ్రైవర్ తమకు అండగా నిలవడం పట్ల ఆ కుటుంబమంతా ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. 


మంజునాథ్ మాట్లాడుతూ, ఇబ్బందుల్లో ఉన్న ఓ కుటుంబానికి అత్యవసర పరిస్థితిలో అండగా నిలవడం తనకు చాలా సంతోషం కలిగించిందని తెలిపారు. ఆ పెద్దాయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో తాను చాలా సంతోషించినట్లు తెలిపారు. అదే తనకు గొప్ప పారితోషికమని తెలిపారు. 


కోవిడ్-19 మహమ్మారికి ముందు తాను తన కుటుంబ పోషణ కోసం పని చేసేవాడినని, ఇప్పుడు అనేక మంది రోగులకు సాయపడుతూ వారి ఆదరాభిమానాలను కూడా సంపాదించుకుంటున్నానని మంజునాథ్ తెలిపారు.


Updated Date - 2020-05-18T02:14:39+05:30 IST