బిహార్‌ అసెంబ్లీతోపాటే ఉప ఎన్నికలు

ABN , First Publish Date - 2020-09-05T07:24:30+05:30 IST

బిహార్‌లోని వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానంతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 64 అసెంబ్లీ స్థానాలకు ఉప

బిహార్‌ అసెంబ్లీతోపాటే  ఉప ఎన్నికలు

దుబ్బాక సహా 64 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి

నవంబరు 29వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి: ఎన్నికల కమిషన్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బిహార్‌లోని వాల్మీకినగర్‌ లోక్‌సభ స్థానంతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే నిర్వహిస్తామని భారత ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. వీటిలో తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది.


2018 ఎన్నికల్లో ఇక్కడినుంచి గెలుపొందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆగస్టు 6న మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. కాగా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను నవంబరు 29లోపు పూర్తి చేయాల్సి ఉన్నందున.. దేశ వ్యాప్తంగా ఖాళీలు ఏర్పడ్డ స్థానాలకు కూడా ఆ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్‌ శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించింది.


పోలీసు బలగాలు, ఇతర ఏర్పాట్ల రీత్యా బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో ఉప ఎన్నికలను కూడా కలపాల్సి వచ్చిందని కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ 64 అసెంబ్లీ స్థానాల్లో మధ్యప్రదేశ్‌లోనే 27 ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన 27 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. దీంతో ఆ రాష్ట్రంలో కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయి.. బీజేపీ అధికారంలోకి వచ్చింది. 


Updated Date - 2020-09-05T07:24:30+05:30 IST