యూపీలో సాధువుల హత్యలపై యోగికి ఉద్ధవ్ ఫోన్

ABN , First Publish Date - 2020-04-28T23:04:36+05:30 IST

ముంబై: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లోని పగోనా గ్రామ శివాలయంలో ఇద్దరు సాధువుల హత్యలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే

యూపీలో సాధువుల హత్యలపై యోగికి ఉద్ధవ్ ఫోన్

ముంబై: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లోని పగోనా గ్రామ శివాలయంలో ఇద్దరు సాధువుల హత్యలపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే యూపీ సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అటు ఈ కేసులో సాధువులను హత్య చేసిన మురారీ అలియాస్ రాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయంలో నిద్రిస్తున్న సాధువులను కత్తితో పొడిచి చంపినట్లు మురారీ పోలీసుల ముందు అంగీకరించాడు. దేవుడి కోరినందుకే చంపేశానంటూ గంజాయి మత్తులో ఉన్న మురారీ పోలీసులకు చెప్పాడు. మురారీ గతంలో ఓ సారి జైలుకెళ్లి వచ్చాడు. పగోనా శివాలయంలో పదేళ్లుగా ఉంటోన్న జగన్‌దాస్ (55) సేవా దాస్(35)లతో మురారి రెండు రోజుల క్రితం గొడవపడ్డాడు. 48 గంటల్లోనే వారిని నిద్రిస్తుండగా ప్రాణాలు తీశాడు. 


ఏప్రిల్ 16న మహారాష్ట్ర పాల్‌ఘర్‌లో సాధువులను మూకోన్మాదంతో హత్య చేసినప్పుడు యూపీ సీఎం యోగి ఉద్దవ్‌కు ఫోన్ చేశారు. బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన జరిగిన రెండు వారాల్లోపే యూపీలోనూ సాధువుల హత్యలు జరగడంతో ఉద్ధవ్ యోగికి ఫోన్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 


పాల్‌ఘర్‌లో ఏప్రిల్ 16న తమ గురువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా గడ్చింధాలి గ్రామం వద్ద సాధువుల వాహనంపై దుండగులు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేశారు. వాహనంలో ఉన్న కల్పవృక్ష గిరి మహరాజ్, సుశీల్ గిరి మహరాజ్‌లను దారుణంగా కొట్టి చంపారు. ఘటనకు సంబంధించి 110మందిని మహారాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 

Updated Date - 2020-04-28T23:04:36+05:30 IST