కరోనా సీల్ నుంచి 45 శాతం భవనాలకు విముక్తి!
ABN , First Publish Date - 2020-06-22T12:43:03+05:30 IST
మహానగరం ముంబైలో కరోనా కేసులు వెలుగుచూసిన 10, 369 భవనాలను కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. అయితే 4,710 మంది కరోనా బాధితులు కోలుకున్న నేపధ్యంలో వారు ఉంటున్న 45 శాతం భవనాలకు...

ముంబై: మహానగరం ముంబైలో కరోనా కేసులు వెలుగుచూసిన 10, 369 భవనాలను కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. అయితే 4,710 మంది కరోనా బాధితులు కోలుకున్న నేపధ్యంలో వారు ఉంటున్న 45 శాతం భవనాలకు సీలు తీశారు. ప్రస్తుతం కరోనా కేసుల కారణంగా 5,659 భవనాలు అంటే 55 శాతం మూసివేసివున్నాయి. అంధేరి వెస్ట్, వెర్సోవా ప్రాంతంలోని 516 భవనాల సీల్ తీశామని బిఎంసి అధికారులు తెలిపారు. ఇంకా అక్కడ ప్రస్తుతం 230 భవనాలు మాత్రమే మూసివేసివున్నాయన్నారు. భవనాల సీలింగ్ విషయంలో బోరివాలి రెండవ స్థానంలో ఉందని, ఇక్కడ గరిష్టంగా 935 భవనాలు మూసివేశామన్నారు. వాటిలో 476 భవనాలకు సీల్ నుంచి విముక్తి కల్పించామని చెప్పారు. కాగా ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ముంబైలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసులు స్థిరంగా ఉన్నాయి. కేసులలో ఆకస్మిక పెరుగుదల చోటుచేసుకోవడం లేదు. కాగా బిఎంసి ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం జూన్ 7 న మహానగరంలో 1,421 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. జూన్ 20 న 1,197 నమోదయ్యాయి. ఈ 13 రోజుల్లో కొత్తగా కరోనా వైరస్ కేసులు సగటున 1,100 నుంచి 1,300 మధ్య కనిపించాయి. బిఎంసి ఆరోగ్య శాఖ అదనపు మునిసిపల్ కమిషనర్ సురేష్ కాకాని మాట్లాడుతూ గత 13 రోజుల డేటాను చూస్తే ముంబైలో కరోనా వైరస్ కేసులు స్థిరంగా ఉన్నట్లు పరిగణించవచ్చన్నారు. త్వరలో కేసుల్లో తగ్గుదల కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.