కొవిడ్-19: ప్రజల జీవితాలతో బ్రిటన్ ప్రభుత్వం గేమ్స్?

ABN , First Publish Date - 2020-03-16T22:19:10+05:30 IST

హెర్డ్ ఇమ్యూనిటీ విధానంపై బ్రటన్‌లో తీవ్ర వ్యతిరేకత. వెనకుడుగేసిన ప్రభుత్వం

కొవిడ్-19: ప్రజల జీవితాలతో బ్రిటన్ ప్రభుత్వం గేమ్స్?

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి మార్గం ఏమిటి.. ప్రపంచ దేశాల ముందున్న బిలియన్ డాలర్ల ప్రశ్న ఇదే. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు సోషల్ డిస్టెన్సింగ్(సామాజికంగా దూరం పాటించడం) విధానాన్ని అనుసరిస్తున్నాయి. స్నేహితులు, బంధువులను కలవడం, పార్టీలు చేసుకోవడం వంటి కార్యక్రమాలకు కొన్ని రోజులు పాటు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. వీలైనంత వరకూ ఇంటిపట్టునే ఉండాలని సూచిస్తున్నాయి. అమెరికా, జర్మనీ, ఇటలీ దేశాలు ఇప్పటికే బహిరంగ కార్యక్రమాలను నిషేధించాయి. మరి బ్రిటన్ ఏం చేస్తోందీ అంటే చేతులు ముడుచుక్కూర్చుంది అని కొందరు శాస్త్రవేత్తలు ఆరోపిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా యూకే ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు సర్ ప్యాట్రిక్ వాలెన్స్ గత శుక్రవారం ఓ సంచలన వ్యాఖ్య చేశారు. బ్రిటన్‌లో కరోనా ఇన్ఫెక్షన్ రేటు కనీసం 60 శాతం ఉంటే హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగి వ్యాధిని నిరోధించవచ్చని ప్రతిపాదించారు. అంటే బ్రిటన్‌లో కనీసం 60 శాతం మందికి కరోనా సోకాలన్నమాట.  ఈ వ్యాఖ్యలపై సహజంగానే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.


హెర్డ్ ఇమ్యూనిటీ అంటే..

ఓ ప్రాంతంలో అధిక శాతం మంది ప్రజలు ఓ వ్యాధి నిరోధక వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అక్కడ వ్యాధి వ్యాప్తి నెమ్మదిస్తుంది. దురదృష్టవశాత్తూ ఆ ప్రాంతంలో వ్యాక్సిన్ తీసుకోని వారెవరైనా వ్యాధి బారినపడ్డా ఆ సమాజంలో వ్యాధి అంత తొందరగా వ్యాపించదు. అధిక శాతం మంది వ్యాక్సిన్ తీసుకుని ఉండటమే దీనికి కారణం. దీన్నే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. మరి కరోనా వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో రాలేదు కదా అని సందేహం రావచ్చు. అయితే ఇటువంటి మహమ్మారులు సమాజంలో ప్రబలినప్పుడు బాధితుల్లో సహజసిద్ధంగా వ్యాధి నిరోధకశక్తి పెరిగి వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తుంది. మానవ చరిత్రలో అనేక సార్లు ఇలా జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా జరగాలంటే ఇన్ఫెక్షన్ రేటు 60 శాతం ఉండాలని సర్ ప్యాట్రిక్ సూచిస్తున్నారు. దీని కోసం హై రిస్క్ వర్గాలైన వృద్ధులు, పిల్లలకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే సమయంలో లో-రిస్క్ గ్రూపులైన యువకులకు వైరస్ సోకడంతో వారి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధి వ్యాప్తి నెమ్మదిస్తుంది. దీని వల్ల ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వైద్య సిబ్బందికి కొంత ఊరట లభిస్తుంది. ఈ విధానంపై సహజంగానే బ్రిటన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-03-16T22:19:10+05:30 IST