కోవిడ్-19 చిక్కులు : అమృత్‌సర్ నుంచి లండన్‌కు ప్రత్యేక విమానం

ABN , First Publish Date - 2020-04-21T22:13:12+05:30 IST

దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల ప్రయాణ సౌకర్యాలు లేక, చిక్కుకుపోయిన 250

కోవిడ్-19 చిక్కులు : అమృత్‌సర్ నుంచి లండన్‌కు ప్రత్యేక విమానం

అమృత్‌సర్ : దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల ప్రయాణ సౌకర్యాలు లేక, చిక్కుకుపోయిన 250 మందిని మంగళవారం ప్రత్యేక విమానంలో లండన్‌కు తరలిస్తున్నారు. బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రత్యేక విమానంలో 222 మంది బ్రిటన్ జాతీయులు, 28 మంది భారతీయులు లండన్ వెళ్తున్నట్లు పంజాబ్ విపత్తు నిర్వహణ విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేబీఎస్ సిద్ధు ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. 


కోవిడ్-19 మహమ్మారిని నిరోధించడంలో భాగంగా అమలవుతున్న అష్ట దిగ్బంధనం వల్ల చిక్కుకుపోయినవారిని తిరిగి బ్రిటన్‌కు రప్పించేందుకు మరొక 17 చార్టడ్ విమానాలను నడుపుతామని గత వారం బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న కూడా 260 మంది ప్రయాణికులతో బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రత్యేక విమానం అమృత్‌సర్ నుంచి బయల్దేరింది. ఏప్రిల్ 21, 23, 25, 27 తేదీల్లో కూడా విమానాలను నడుపుతామని హై కమిషన్  పేర్కొంది. 


అహ్మదాబాద్ మీదుగా బెంగళూరు నుంచి లండన్‌కు ఈ నెల 23న విమానాలు నడుస్తాయి. ఢిల్లీ నుంచి లండన్‌కు ఈ నెల 21, 23, 25, 27 తేదీల్లో విమానాలు నడుస్తాయి. గోవా నుంచి  లండన్‌కు ఈ నెల 20, 22, 24 తేదీల్లో నడుస్తాయి. ముంబై నుంచి  లండన్‌కు ఈ నెల 26న ఓ విమానం నడుస్తుంది. 


భారత దేశంలో బ్రిటన్ తాత్కాలిక హై కమిషనర్ జే థాంప్సన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం, స్థానిక అధికారులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఎక్కువ మంది చిక్కుకున్న ప్రాంతాల నుంచి విమానాలను నడిపేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.


Updated Date - 2020-04-21T22:13:12+05:30 IST