బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం విషమం
ABN , First Publish Date - 2020-04-07T10:47:28+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా 70 వేల మందిని కరోనా బలితీసుకొంది. యూర్‌పలో అత్యధికంగా 50,125 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో ..

ఐసీయూకు తరలింపు
అమెరికాలో 10 వేలు దాటిన మృతులు
పారిస్, ఏప్రిల్ 6: ప్రపంచవ్యాప్తంగా 70 వేల మందిని కరోనా బలితీసుకొంది. యూర్‌పలో అత్యధికంగా 50,125 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలో సోమవారం 900 మంది చనిపోగా.. మొత్తం సంఖ్య 10,516కు చేరింది. కొత్తగా పాజిటివ్ కేసులే 20 వేల వరకు నమోదవడం గమనార్హం. 15,877 మరణాలతో ఇటలీ, 13,055 మరణాలతో స్పెయిన్, 8,078 మరణాలతో ఫ్రాన్స్ విషాదంలో కూరుకుపోయాయి. యూర్‌పలో ఒక్కరోజే 1100 మంది చనిపోయారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకు తరలించారు. ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ వీడియో లింకు ద్వారా కామన్‌వెల్త్ దేశాలను అప్రమత్తం చేశారు. బ్రిటన్‌లో సోమవారం 439 మంది మృతి చెందారు. దీంతో మరణాలు 5,373 మందికి చేరాయి. స్పెయిన్, ఇటలీలో 24 గంటల్లో వరుసగా 637, 636 మంది చనిపోయారు. ఒకదశలో ఒక్కరోజే 950 మరణాలను చూసిన స్పెయిన్‌లో రెండు వారాల్లో తొలిసారిగా సోమవారమే తక్కువ మరణాలు నమోదయ్యాయి. లక్ష పాజిటివ్ కేసుల జాబితాలో జర్మనీ చేరిపోయింది. ఇప్పటికి 1,500 మంది చనిపోయారు. దాదాపు 20 వేల మంది విదేశీయులను సింగపూర్ ప్రభుత్వంలో క్వారంటైన్ చేసింది. పాకిస్థాన్‌లో ఇప్పటికి 3,277 పాజిటివ్ కేసులు బయటపడగా, 1500 కేసులు పంజాబ్ ప్రావిన్సీలోనే నమోదయ్యాయి. చైనాలో రెండోవిడత కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికి 38 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వైరస్‌కు ఔషధం విషయంలో ఫ్రాన్స్ కూడా అమెరికా బాటపట్టాలని ప్రజలు ఉద్యమిస్తున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషధం ఇచ్చేలా వైద్యులకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఏకంగా 2.15 లక్షల మంది సంతకాలతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సరిహద్దులు మూసుకుపోయి.. ఎక్కడికక్కడ కంచెలు మొలుస్తున్న కాలంలో సిగరేట్లు అమ్మడానికి ఫ్రాన్స్ నుంచి స్పెయిన్‌కు బయలుదేరిన ఓ వ్యాపారిని సరిహద్దుల్లో రక్షించి ఫ్రాన్స్ అధికారులు జరిమానా విధించారు.