బ్రిటన్‌లో ఆస్పత్రులు ఫుల్
ABN , First Publish Date - 2020-12-30T08:15:09+05:30 IST
బ్రిటన్ ఇప్పుడు కరోనా కొత్త స్ట్రెయిన్‌తో అతలాకుతలమవుతోంది. వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో.. కొవిడ్-19కు చికిత్సనందిస్తున్న ఆస్పత్రులన్నీ నిండిపోయాయి.

కరోనా కొత్త స్ట్రెయిన్‌తో రోజురోజుకీ పెరుగుతున్న కేసులు
లండన్, డిసెంబరు 29: బ్రిటన్ ఇప్పుడు కరోనా కొత్త స్ట్రెయిన్‌తో అతలాకుతలమవుతోంది. వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో.. కొవిడ్-19కు చికిత్సనందిస్తున్న ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. కొత్త స్ట్రెయిన్ ముప్పు మున్ముందు మరింత పొంచి ఉండడంతో.. చికిత్సలపై జాతీయ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా కల్లోలం ఆరంభమయ్యాక ఏప్రిల్ నెలలో కేసుల పెరుగుదల ఉత్థాన స్థాయికి చేరుకుందని.. ఇప్పుడు అంతకు మించి కేసులు నమోదవుతున్నాయని ఎన్‌హెచ్‌ఎస్ చీఫ్ సర్ సైమన్ స్టీవెన్స్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కొత్త స్ట్రెయిన్ ప్రారంభమయ్యాక.. సోమవారానికి దేశంలోని ఆస్పత్రుల్లో అత్యధికంగా 20,426 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కల్లోలం ప్రారంభమయ్యాక ఏప్రిల్ 12న రికార్డు స్థాయిలో 18,974 మంది చికిత్స పొందారు. ఆ తర్వాత ఇదే అత్యధికం. మంగళవారం 41,385 కొత్త కేసులు నమోదయ్యాయి’’ అని ఎన్‌హెచ్‌ఎస్ గణాంకాలు చెబుతున్నాయి. కేసులు, రోగులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆస్పత్రి సిబ్బందీ వైరస్ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వొన్నే డోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ప్రపంచంలోనే రష్యా అత్యధిక కరోనా మరణాలను నమోదు చేసుకుంటోంది.