భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు నేడు

ABN , First Publish Date - 2020-09-01T16:38:05+05:30 IST

తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ ట్సో సరస్సు దక్షిణ తీరంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా

భారత్-చైనా సైనిక కమాండర్ల చర్చలు నేడు

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ ట్సో సరస్సు దక్షిణ తీరంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించిన నేపథ్యంలో భారత్, చైనా బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు మంగళవారం జరుగుతాయి. 


భారత సైన్యంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, భారత సైన్యం, చైనా సైన్యం బ్రిగేడ్ కమాండర్ స్థాయి చర్చలు చూసుల్/మోల్డోలో మంగళవారం జరుగుతాయి. పాంగాంగ్ ట్సో సరస్సు దక్షిణ తీరంలో పరిస్థితిని వీరు చర్చిస్తారు. వివాదం ఏర్పడిన 2 ప్రాంతాలపై చర్చ జరగవచ్చు. 


భారత దళాలు ప్రస్తుతం ఉన్న కొన్ని ప్రాంతాల నుంచి వెనుకకు వెళ్ళిపోవాలని చైనా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  బ్లాక్ టాప్, హెల్మెట్ టాప్ ప్రాంతాల్లో చైనా దళాలను మోహరించడంపై భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. 


చైనా దళాలు ఏకపక్షంగా వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు ఆగస్టు 29/30 మధ్య రాత్రి ప్రయత్నించడంతో, భారతీయ దళాలు దీటుగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్మీ అధికార ప్రతినిథి కల్నల్ అమన్ ఆనంద్ మాట్లాడుతూ, సైనిక, దౌత్యపరమైన చర్చల సందర్భంగా ఇరు  దేశాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉల్లంఘించిందని చెప్పారు. 


Updated Date - 2020-09-01T16:38:05+05:30 IST