విద్వేష ప్రసంగాన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించండి : బోంబే హైకోర్టు
ABN , First Publish Date - 2020-05-24T20:50:52+05:30 IST
సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ అయిన విద్వేషపూరత ప్రసంగం వీడియో

ముంబై : సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ అయిన విద్వేషపూరత ప్రసంగం వీడియో క్లిప్‌ను దర్యాప్తు జరిపి, తొలగించాలని బోంబే హైకోర్టు ముంబై పోలీసులను ఆదేశించింది. ఆలిండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) మద్దతుదారు అబు ఫైజల్ ఈ వీడియోను ఫేస్‌బుక్,యూట్యూబులలో పోస్ట్ చేసినట్లు పిటిషనర్ ఆరోపించారు.
ముంబైవాసి ఇమ్రాన్ మొయిన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు విచారించింది. దీనిపై విచారణను జస్టిస్ ఆర్ డీ ధనూకా, జస్టిస్ అభయ్ అహుజా డివిజన్ బెంచ్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిపింది.
ఫైజల్ విద్వేషపూరిత ప్రసంగాన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని, ఆయనను సామాజిక మాధ్యమాల నుంచి శాశ్వతంగా దూరం చేయాలని పిటిషనర్ కోరారు.
ఫైజల్ వీడియోలో ఉన్న వివరాలను పిటిషనర్ వివరించారు. కరోనా వైరస్ మహమ్మారి ముసుగులో ముస్లిం మతాన్ని లక్ష్యంగా చేసుకోవాలని, అపఖ్యాతిపాలు చేయాలని మీడియాకు ఆదేశాలు వెళ్ళాయని ఫైజల్ ఈ వీడియోలో అన్నాడని తెలిపారు.
ముస్లిం జనాభాను నియంత్రించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ప్రచారం చేస్తోందని ఈ వీడియోలో ఫైజల్ ఆరోపించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.
ఫైజల్ తన కమ్యూనిటీ ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఇతర మతాలకు చెందిన డాక్టర్లపై దాడులు చేసేవిధంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
ఫిర్యాదును ప్రాథమికంగా పతరిశీలించినపుడు నేరం వెల్లడవుతోందని, ఈ ఆరోపణలపై పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరపాలని హైకోర్టు తెలిపింది. ఒక వారంలోగా ప్రతిస్పందించాలని కోరింది. ఆరోపణల్లో సారం ఉన్నట్లు తేలితే అబు ఫైజల్‌పై దర్యాప్తు జరపాలని ఆదేశించింది.
పిటిషనర్ పేర్కొన్న వీడియో క్లిప్‌ను తక్షణమే తొలగించాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 2న జరుగుతుంది.