ముంబైలో నైట్ కర్ఫ్యూకి బీఎంసీ ప్రతిపాదన!

ABN , First Publish Date - 2020-12-12T00:26:54+05:30 IST

ముంబైలో నైట్ కర్ఫ్యూ విధించాలంటూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు...

ముంబైలో నైట్ కర్ఫ్యూకి బీఎంసీ ప్రతిపాదన!

ముంబై: ముంబైలో నైట్ కర్ఫ్యూ విధించాలంటూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నగరంలో అర్థరాత్రి దాటిన తర్వాత కూడా నైట్ క్లబ్‌లు కొనసాగుతుండడం.. పార్టీలకు వెళ్తున్న వారు కనీసం కొవిడ్-19 నిబంధనలను పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. గత వారంలో పోలీసులు, బీఎంసీ అధికారులు కొన్ని నైట్‌ క్లబ్‌లలో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‘‘ఓ నైట్‌ క్లబ్‌లో దాదాపు వెయ్యిమంది ఫేస్‌మాస్కులు ధరించకుండా పార్టీ చేసుకుంటున్నారు. దీంతో ఆ నైట్‌క్లబ్ మీద కేసు నమోదు చేశాం. కాబట్టి ప్రజలు కనీస నిబంధనలు పాటించాలని కోరుతున్నాం. ఇదే పరిస్థితి ఇకముందు కూడా కొనసాగితే నైట్ కర్ఫ్యూ విధించక తప్పదని మేము ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. డిసెంబర్ 20 వరకు చూసి... పరిస్థితిని బట్టి కర్ఫ్యూపై నిర్ణయం తీసుకుంటాం..’’ అని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ పేర్కొన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించాలంటూ ఆయన ప్రభుత్వానికి సూచించారు. గత వారంలో కూడా ముంబైలో నైట్ కర్ఫ్యూ కోరుతూ చాహల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ... డిసెంబర్ 25 వరకు వేచిచూడాలని ప్రభుత్వం పేర్కొంది. అప్పటి వరకు పరిస్థితిని పర్యవేక్షించి క్రిస్మస్ అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ లోగా మొత్తం 24 వార్డుల్లోనూ కొవిడ్-19 నిబంధనలు అనుసరిస్తున్న తీరుపై అకస్మిక తనిఖీలు నిర్వహించాలంటూ అసిస్టెంట్ కమిషనర్లకు బీఎంసీ చీఫ్ ఆదేశించారు. 

Updated Date - 2020-12-12T00:26:54+05:30 IST