రాజకీయ తుఫాన్ రేపుతున్న మమతా బెనర్జీ పాట

ABN , First Publish Date - 2020-05-08T22:21:20+05:30 IST

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనాపై రాసిన పాట ఇప్పుడు తృణమూల్, బీజేపీ మధ్య చిచ్చు రాజేసింది.

రాజకీయ తుఫాన్ రేపుతున్న మమతా బెనర్జీ పాట

కోల్‌కతా : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కరోనాపై రాసిన పాట ఇప్పుడు తృణమూల్, బీజేపీ మధ్య చిచ్చు రాజేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కరోనాపై సీఎం మమతా బెనర్జీ రాసిన ఓ పాటను రాష్ట్రమంతా ప్లే చేయాలంటూ పోలీసు శాఖ సూచించింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ తుఫాన్ చెలరేగింది. ఈ నిర్ణయాన్ని కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానంగా ప్రతిపక్ష బీజేపీ నేతలు.


దీనిపై బీజేపీ నేత ముకుల్ రాయ్ మాట్లాడుతూ... ‘‘అంతటి విశ్వ విఖ్యాతంగా ప్రఖ్యాతి గాంచిన రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితానికీ, ఆయన వారసత్వానికీ, మమత రాసిన పాటకు సంబంధం ఏమిటి? అని సూటిగా ప్రశ్నించారు. ఈ నిర్ణయం కేవలం రవీంద్రుడి ప్రతిష్ఠకు భంగం కలిగించడమే కాకుండా, కరోనాకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని పలచన చేయడమేనని ఆయన ధ్వజమెత్తారు.


ఇక మరో బీజేపీ నేత లాకెట్ ఛర్జీ మాట్లాడుతూ సీఎం నిర్ణయాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు. అయితే ఈ విమర్శలపై అధికార టీఎంసీలు నేతలు కౌంటర్ ఇచ్చారు. విశ్వకవి రవీంద్రుడి జయంతిని పురస్కరించుకొని కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికే సర్కార్ ప్రయత్నించిందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రతిదానిని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రవీంద్రుడి జయంతి రోజున ముఖ్యమైన భవంతుల వద్ద ఠాగోర్ రాసిన పాటలతో పాటు మమత రాసిన పాటను కూడా ప్లే చేయాలంటూ పోలీసు శాఖ ఆదేశాలు జారీచేసింది. 

Updated Date - 2020-05-08T22:21:20+05:30 IST