సీఎం యడియూరప్పకు అసంతృప్తి సెగ...

ABN , First Publish Date - 2020-02-08T21:31:05+05:30 IST

కర్ణాటక మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కక పోవడంపై బీజేపీ సీనియర్ నేత, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అరగ జ్ఞానేంద్ర శనివారంనాడు తీవ్ర అసంతృప్తి..

సీఎం యడియూరప్పకు అసంతృప్తి సెగ...

శివమొగ్గ: కర్ణాటక మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కక పోవడంపై బీజేపీ సీనియర్ నేత, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అరగ జ్ఞానేంద్ర శనివారంనాడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్ధహళ్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అరగ జ్ఞానేంద్ర మీడియాతో మాట్లాడుతూ, 1983లో బీఎస్ యడియూరప్ప, తాను ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని, అదే ఏడాది తామిద్దరం బీజేపీ నుంచి పోటీ చేశామని చెప్పారు.


'అట్టడుగు స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేశాను. ఏమీ అశించకుండానే పార్టీ నిర్మాణం కోసం శ్రమించాం.  ప్రస్తుత పరిస్థితి నాకు తెలుసు. అయితే మంత్రి పదవి కేటాయించాలన్న నా అభ్యర్థనను ముఖ్యమంత్రి తప్పనిసరిగా పరిశీలించాలి. విస్తరణలో సీనియర్ బీజేపీ ఎమ్మెల్యేలకు అన్యాయం జరగడం నిజమే. క్యాబినెట్‌లో చోటివ్వాలని సీఎంను కోరుతున్నాను. రాబోయే రోజుల్లో చోటు దక్కుతుందని అనుకుంటున్నాను' అని జ్ఞానేంద్ర అన్నారు.


గత బుధవారంనాడు కర్ణాటక మంత్రివర్గ విస్తరణలో భాగంగా రమేష్ జార్ఖిహోలి, ఆనంద్ సింగ్, కె.సుధాకర్, బీఏ బసవరాజ్ సహా 10 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఎక్కువ మంది గత డిసెంబర్‌లో జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై గెలిచిన వారే. వీరంతా జేడీఎస్, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలే కావడం విశేషం. గత ఏడాది వీరు సొంత పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడంతో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి సర్కార్ కుప్పకూలింది. వీరిపై అప్పటి గవర్నర్ అనర్హత వేటు వేసినప్పటికీ, సుప్రీంకోర్టు వారికి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది.

Updated Date - 2020-02-08T21:31:05+05:30 IST