ఆమె ఓ 'జులాయి'.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-10-07T21:01:11+05:30 IST

హథ్రాస్ ఘటన చుట్టూ మురికి రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. 19 ఏళ్ల దళిత బాలికపై ..

ఆమె ఓ 'జులాయి'.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

లక్నో: హథ్రాస్ ఘటన చుట్టూ మురికి రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. 19 ఏళ్ల దళిత బాలికపై పాశవిక దాడి జరిగిన ఘటనలో నిందితులైన నలుగురు అగ్రవర్ణ యువకులు అమాయకులని, బాధితురాలు ఒక 'తిరుగుబోతు' (అవారా) అని బారాబంకీకి చెందిన బీజేపీ నేత రంజీత్ బహదూర్ శ్రీవాత్సవ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 44 క్రిమినల్ కేసులున్న శ్రీవాత్సవ మంగళవారం రాత్రి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. నిందితుడితో ఆమె అక్రమ సంబంధం నడుపుతోందని, సెప్టెంబర్ 14న జొన్న చేనులోకి అతన్ని పిలుపించుకుందని కూడా ఆయన ఆరోపించారు.


'ఎఫైర్ నడుపుతున్నందు వల్లే జొన్న చేనులోకి ఆ కుర్రాడిని పిలిపించుకుంది. ఆ వార్త సోషల్ మీడియోలోనూ, న్యూస్ ఛానెల్స్‌లోనూ వచ్చింది. అప్పుడైనా ఆమెను పట్టుకుని ఉండాల్సింది' అని శ్రీవాత్సవ వ్యాఖ్యానించాడు. అక్కడితో ఆయన ఆగలేదు. అలాంటి అమ్మాయిలు కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో మాత్రమే చనిపోయి కనిపిస్తారంటూ నోరు పారేసుకున్నారు. చెరుకు, మొక్కజొన్న, గుబురు పొదలు వంటి చోట్లలోనే ఇలాంటి వాళ్లు చనిపోవడం కనిపిస్తుందని, పంట పొలాల్లో ఎందుకు కనిపించరని ప్రశ్నించారు.


'ఆ కుర్రాళ్లు అమాయకులని నేను చెప్పదలచుకున్నాను. వారిని సకాలంలో విడుదల చేయకుంటే తీవ్ర మానసిక వేధనకు గురవుతారు. వాళ్లు కోల్పోయిన భవిష్యత్తును ఎవరు తిరిగి ఇవ్వగలుగుతారు? వాళ్లకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందా' అని శ్రీవాస్తవ నిలదీశారు.


కాగా, శ్రీవాత్సవ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ చీఫ్ రేఖా శర్మ తీవ్రంగా పరిగణించారు. 'ఏ పార్టీకీ నేతగా చెప్పుకోవడానికి అతను పనికిరాడు. మానసిక వ్యాధిగ్రస్తుడని ఆయన మాటలే చెబుతున్నాయి. ఆయనకి నోటీసు ఇస్తాం' అని రేఖా శర్మ తెలిపారు.

Updated Date - 2020-10-07T21:01:11+05:30 IST