బీజేపీలోకి బహిష్కృత ఎమ్మెల్యే..?

ABN , First Publish Date - 2020-03-18T16:15:19+05:30 IST

బీఎస్పీ నుంచి బహిష్కృతుడైన చామరాజనగర్‌ జిల్లా కొల్లేగాళ ఎమ్మెల్యే ఎన్‌. మహేష్‌ బీజేపీలోకి చేరుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ఎంపీ వి. శ్రీనివాసప్రసాద్‌ను సోమవారం

బీజేపీలోకి బహిష్కృత ఎమ్మెల్యే..?

బెంగళూరు (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఎస్పీ నుంచి బహిష్కృతుడైన చామరాజనగర్‌ జిల్లా కొల్లేగాళ ఎమ్మెల్యే ఎన్‌. మహేష్‌ బీజేపీలోకి చేరుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన బీజేపీ ఎంపీ వి. శ్రీనివాసప్రసాద్‌ను సోమవారం చామరాజనగర్‌లోని ఆయన నివాసంలో భేటీ కావడమే కాకుండా గంటకుపైగా మంతనాలు జరపడంతో రాజకీయంగా తీవ్ర కుతూహలం రేకెత్తిస్తోంది. రాష్ట్రంలో జేడీఎ్‌స-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన అనంతరం జరిగిన బలపరీక్ష సమయంలో మహేష్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. దీనిపై బీఎస్పీ అధిష్ఠానం తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేసి ఆయనపై బహిష్కరణ వేటు వేసిన సంగతి విధితమే. అప్పటి నుంచి బీజేపీ విషయంలో మెతక వైఖరి అవలంభిస్తున్నారు. కాగా కొల్లేగాళ నగర సభలో తన అనుచరులు అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ సహకారం అవసరం కానుండడంతో శ్రీనివాసప్రసాద్‌తో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి బీజేపీలో చేరేందుకు మహేష్‌ ఆసక్తితో ఉన్నారని... అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని ఈ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2020-03-18T16:15:19+05:30 IST