కంగన ప్రచారంపై ఫడ్నవిస్ ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2020-09-14T19:25:19+05:30 IST
బీహార్ ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ప్రధాన ప్రచార కర్త (స్టార్ క్యాంపెయినర్)గా బీజేపీ ..
ముంబై: బీహార్ ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ప్రధాన ప్రచార కర్త (స్టార్ క్యాంపెయినర్)గా బీజేపీ తీసుకురానుందనే ఊహాగానాలపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీహార్ ఎన్నికల ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. స్టార్ క్యాంపెయినర్‌గా కంగనాను తీసుకువచ్చే ఆలోచన ఏదీ బీజేపీకి లేదని ఆయన తెలిపారు. ఎన్డీయే తరఫున ప్రధాని నరేంద్ర మోదీనే అతిపెద్ద స్టార్ క్యాంపెయినర్ అని, ఇతర స్టార్ క్యాంపెయినర్ల అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
ముంబైలోని కంగనా రనౌత్ ఇంటిని కూల్చివేత అనంతరం శివసేన, కంగన మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై అడిగినప్పుడు, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఎక్కువ దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. దీనికి బదులుగా ఆయన కంగనాతో అమీతుమీకే ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు.
ముంబైను పీఓకేతో పోలుస్తూ ఇంటీవల కంగనా వ్యాఖ్యలు చేయడంతో మొదలైన దుమారం సంజయ్ రౌత్ ప్రతివిమర్శలతో అట్టుడికింది. బాంద్రాలోని కంగనా కార్యాలయాన్ని బృహాన్ ముంబై మున్సిపల్ అధికారులు అక్రమకట్టడంగా పేర్కొంటూ కూల్చేయడంతో సెప్టెంబర్ 9న ముంబై వచ్చిన కంగనా, ఐదురోజుల అనంతరం సోమవారం ఉదయం ముంబై వదలి మనాలి వెళ్లిపోయింది. ఇన్నిరోజులూ తనను భయభ్రాంతులకు గురిచేశారని, తాను పనిచేసుకునే కార్యాలయాన్ని కూలగొట్టారని, ఆయుధాల పహారా మధ్య భద్రతతో గడిపానని, చివరకు బరువెక్కిన హృదయంతో ముంబై విడిచిపెడుతున్నానని సోమవారం ఆమె ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ముంబైను పీఎంకేతో పోలుస్తూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు కూడా ఆమె తెలిపారు.