రాహుల్‌పై మళ్లీ కస్సుమన్న బీజేపీ

ABN , First Publish Date - 2020-05-09T00:11:20+05:30 IST

వాస్తవాలపై అవగాహన లేకుండా మాట్లాడటం రాహుల్‌ గాంధీ నైజంగా మారిందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. లాక్‌డౌన్‌ ఎత్తేసే విషయంలో కేంద్ర..

రాహుల్‌పై మళ్లీ కస్సుమన్న బీజేపీ

న్యూఢిల్లీ: వాస్తవాలపై అవగాహన లేకుండా మాట్లాడటం రాహుల్‌ గాంధీ నైజంగా మారిందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. లాక్‌డౌన్‌ ఎత్తేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో వ్యవహరించాలంటూ మీడియా ముందు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత సుధాంషు త్రివేది శుక్రవారంనాడు ఘాటుగా స్పందించారు.


'విపక్షాలు ఇచ్చే సూచనలకు మా ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతిస్తుంది. అయితే అవి నిర్మాణాత్మకంగా, అర్ధవంతంగా ఉండాలి. రాహుల్‌కు వాస్తవాలు తెలియకపోవచ్చు. ఆయన ధోరణి సహజంగానే అలా ఉంటుంది. వాస్తవాలు తెలుసుకోకుండా, అవగాహన లేకుండా మీడియా ముందుకు వస్తుంటారు' అని త్రివేది వ్యాఖ్యానించారు. కోవిడ్ వైరస్‌పై పోరాటంలో ప్రధాని అన్ని రాష్ట్రాలను కలుపుకొని వెళ్తున్నారని, జిల్లాల మేజిస్ట్రేట‌్‌‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని చెప్పారు. ప్రధాని ముఖ్యమంత్రుల మీద విశ్వాసం ఉంచుతుంటే, ముఖ్యమంత్రులు జిల్లా మేజిస్ట్రేట్‌లను విశ్వాసంలోకి తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని త్రివేది వివరించారు.


దీనికి ముందు రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ, లాక్‌డౌన్‌ ఎత్తేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో వ్యవహరించాలని అన్నారు. ఎప్పుడు, ఎలా ఎత్తేయాలన్న విషయంలో ప్రభుత్వానికి  అవగాహన ఉలాంటి,  ఏయే ప్రమాణాలు, సూత్రాల ఆధారంగా లాక్‌డౌన్ ఎత్తేస్తారో ఆలోచించాలని అన్నారు. ఈ ప్రమాణాలన్నింటిపై కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ప్రజల ముందుకు రావాలన్నారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వర్గాలకు ఎలాంటి సహాయ, సహకారాలను అందించకుండా లాక్‌డౌన్ కొనసాగించడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని సూచించారు. లాక్‌డౌన్ అనేది కేవలం ‘’ఆన్ - ఆఫ్ స్విచ్’ కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-05-09T00:11:20+05:30 IST