వీఐపీకి తమ వాటా నుంచి 11 సీట్లు ఇచ్చిన బీజేపీ

ABN , First Publish Date - 2020-10-08T01:09:28+05:30 IST

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)లోకి వికాష్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) ప్రవేశం బుధవారంనాడు..

వీఐపీకి తమ వాటా నుంచి 11 సీట్లు ఇచ్చిన బీజేపీ

పాట్నా: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)లోకి వికాష్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) ప్రవేశం బుధవారంనాడు లాంఛనమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకంలో భాగంగా బీజేపీ తమ వాటా నుంచి వీఐపీకి 11 సీట్లు ఇచ్చింది. బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ బుధవారంనాడు ఈమేరకు ఒక ప్రకటన చేశారు. వీఐపీ 11 సీట్లలో పోటీ చేస్తుందని, ఒక ఎమ్మెల్సీ సీటు కూడా ఇస్తామని ఆయన తెలిపారు.


వెనుకబడిన తరగతుల్లో పట్టు కలిగిన వీఐపీని ఇటీవలే కూటమి నుంచి వైదొలిగిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కి ప్రత్యామ్నాయంగా ఎన్డీయే తెచ్చినట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో పోటీ చేయడానికి ఎల్జేపీ ఇష్టపడనందున కూటమి నుంచి ఆ పార్టీ ఇటీవల వైదొలిగింది. కాగా, ఎన్డీయేతో వీఐపీ చేతులు కలపడం వల్ల ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమిపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయని అంటున్నారు.


సీట్ల పంపకంలో భాగంగా 243 స్థానాలకు గాను బీజేపీ 121 సీట్లు, జేడీయూ 122 సీట్లలో పోటీ చేసేందుకు అవగాహన కుదుర్చుకున్నాయి. జేడీయూ తమ కోటా నుంచి జితిన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హిందుస్థాన్ అవామీ మోర్చాకు సీట్లు కేటాయిస్తోంది. అక్టోబర్ 28 నుంచి మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 10న ఫలితాలు ప్రకటిస్తారు.

Read more