సుప్రీంకోర్టుకు మధ్య ప్రదేశ్ హైడ్రామా!

ABN , First Publish Date - 2020-03-16T18:41:40+05:30 IST

మధ్య ప్రదేశ్‌ రాజకీయ హైడ్రామా ఇవాళ సుప్రీంకోర్టు గడప తొక్కింది. అసెంబ్లీ సమావేశాలను పది రోజుల పాటు వాయిదా వేస్తూ ...

సుప్రీంకోర్టుకు మధ్య ప్రదేశ్ హైడ్రామా!

న్యూఢిల్లీ: మధ్య ప్రదేశ్‌ రాజకీయ హైడ్రామా ఇవాళ సుప్రీంకోర్టు గడప తొక్కింది.  అసెంబ్లీ సమావేశాలను పది రోజుల పాటు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఇవాళ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 12 గంటల్లోగా కమల్‌నాథ్ ప్రభుత్వానికి బలపరీక్ష నిర్వహించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ పిటిషన్‌ వేశారు. శివరాజ్ తరుపున న్యాయవాది సౌరభ మిశ్రా సుప్రీంకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని ఆయన తన పిటిషన్‌లో విన్నవించారు.


మైనారిటీ ప్రభుత్వానికి ‘‘కొమ్ముకాస్తూ’’ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చౌహాన్ ఆరోపించారు. కరోనా వైరస్ కారణంగా ఈ నెల 26 వరకు అసెంబ్లీని వాయిదా వేస్తూ స్పీకర్ ప్రజాపతి అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో.. సీఎం కమల్‌నాథ్ బలపరీక్ష కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇవాళ బలపరీక్ష నిర్వహించాలంటూ గవర్నర్ లాల్జీ టాండన్ ఇచ్చిన ఆదేశాలను సైతం స్పీకర్ పక్కనబెట్టారు. కాగా బీజేపీ వేసిన పిటిషన్‌పై  సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-03-16T18:41:40+05:30 IST