బీహార్‌లో 9మంది తిరుగుబాటు నేతలపై బీజేపీ వేటు

ABN , First Publish Date - 2020-10-13T13:42:58+05:30 IST

భారతీయ జనతాపార్టీ బీహార్ తిరుగుబాటు నేతలపై కొరడా ఝళిపించింది....

బీహార్‌లో 9మంది తిరుగుబాటు నేతలపై బీజేపీ వేటు

న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ బీహార్ తిరుగుబాటు నేతలపై కొరడా ఝళిపించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు వ్యతిరేకంగా బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన 9 మంది సీనియర్ నేతలపై బీజేపీ అధిష్ఠానం ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు విధించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ యూ, హిందూస్థాన్ అవామ్ మోర్చా, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీలతో బీజేపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకొని 115 స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించింది. జేడీయూ 110 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీహార్ లో బీజేపీ నేతలు రాజేంద్ర సింగ్, రామేశ్వర్ చౌరాసియా, ఉషావిద్యార్థి, రవీంద్రయాదవ్, శ్వేతాసింగ్, ఇందూకశ్యప్, అనిల్ కుమార్, మృణాల్ శేఖర్, అజయ్ ప్రతాప్ లను ఆరేళ్లపాటు బీజేపీ నుంచి సస్పెన్షన్ చేసినట్లు బీజేపీ ప్రకటించింది. 


పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందునే 9మంది సీనియర్ నేతలను సస్పెండ్ చేసినట్లు బీజేపీ బీహార్ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ చెప్పారు. గతంలో ఎన్డీఏ అభ్యర్థులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఎవరూ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేయవద్దని డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ హెచ్చరించారు. పార్టీ టికెట్ దక్కక పోవడంతో బీజేపీ నేతలు రాజేంద్ర సింగ్, ఉషా విద్యార్థి, రామేశ్వర్ చౌరాసియాలు ఎల్జీపీలో, మరో నేత అజయ్ ప్రతాప్ రాష్ట్రీయ లోక్ సమతాపార్టీలో చేరి ఎన్నికల బరిలోకి దిగారు. 

Updated Date - 2020-10-13T13:42:58+05:30 IST