జేపీ నడ్డా, నితీశ్ కుమార్ భేటీ... సీట్ల పంపకంపై మంతనాలు...
ABN , First Publish Date - 2020-09-12T23:42:24+05:30 IST
బిహార్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ, జేడీయూ సీట్ల పంపకంపై దృష్టి సారించాయి

పాట్నా : బిహార్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ, జేడీయూ సీట్ల పంపకంపై దృష్టి సారించాయి. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ శనివారం పాట్నాలో సమావేశమయ్యారు. ఎన్డీయే కూటమి పక్షాలకు సీట్ల పంపకంపై చర్చలు జరిపారు.
జేపీ నడ్డా బిహార్‌లో రెండు రోజులపాటు పర్యటిస్తారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ఆయన అధికారిక నివాసంలో నడ్డా కలిశారు. ఈ సమావేశంలో బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, బిహార్ బీజేపీ పార్టీ ఇన్‌ఛార్జి భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్, జేడీయూ ముఖ్య నేత రాజీవ్ రంజన్ సింగ్ వురపు లలన్ కూడా పాల్గొన్నారు.
బిహార్ శాసన సభ ఎన్నికలు అక్టోబరు-నవంబరులో జరుగుతాయి. ఈ ఎన్నికల్లో పోటీ కోసం సీట్ల పంపకం గురించి నితీశ్ కుమార్, నడ్డా చర్చించారు. ఈ సమావేశం దాదాపు 1 గంట పాటు జరిగింది. ఎన్డీయే పక్షాలలో ఎవరికెన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై మాట్లాడారు.
ఎన్డీయేలోని లోక్ జన శక్తి పార్టీ ప్రతినిథులు ఈ సమావేశంలో పాల్గొనలేదు. దీంతో జేడీయూ, ఎల్‌జేపీ మధ్య విభేదాలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.