సరిహద్దుల్లో దింపుతామని బైక్ ఎక్కించుకుని.. కొంతదూరం వెళ్లాక..
ABN , First Publish Date - 2020-06-16T14:40:59+05:30 IST
సరిహద్దులకు చేరుస్తామని చెప్పి బైక్‌పై తీసుకెళ్లి హత్యాయ్నానికి పాల్పడిన ఘటన సత్యవేడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన

సత్యవేడు/చిత్తూరు: సరిహద్దులకు చేరుస్తామని చెప్పి బైక్‌పై తీసుకెళ్లి హత్యాయ్నానికి పాల్పడిన ఘటన సత్యవేడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. చెన్నైకి చెందిన సెంథిల్‌కుమార్(49) తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో చెన్నై వెళ్లేందుకు ఆదివారం సాయంత్రం సత్యవేడుకు చేరుకున్నాడు. పట్టణంలో స్థానిక క్లాక్‌టవర్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తాను చెన్నైకు వెళ్లేందుకు సహకరించాలని కోరాడు. ఆ వ్యక్తులు రూ.500 ఇవ్వాలని అడిగారు. అంత నగదు తన వద్ద లేదని చెప్పడంతో తమ వాహనానికి పెట్రోల్ పట్టిస్తే తమిళనాడు సరిహద్దులో వదిలిపెడతామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన సెంథిల్‌కుమార్ వాహనానికి పెట్రోల్ పోయించి వారితో పాటు బైక్‌పై బయలుదేరాడు. తెలుగుగంగ కాలువపై నుంచి ఎన్‌ఎంకండ్రిగ వైపు కొంతదూరం వెళ్లాక వాహనం నుంచి సెంథిల్‌కుమార్ కిందకు దింపి కత్తులతో దాడిచేసి అతని వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యారు. చీకట్లో రక్తపు మడుగులో పడున్న అతనిని గుర్తించిన స్థానికులు సత్యవేడు ఎస్‌ఐ నాగార్జునరెడ్డికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ క్షతగాత్రుడిని సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం తిరుపతి రుయాకు తరలించారు. హత్యాప్రయత్నం జరిగిన ప్రాంతం తమిళనాడు సరిహద్దు కావడంతో మాదరపాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సత్యవేడు దళవాయి అగ్రహారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను సత్యవేడు పోలీసులు అదుపులో తీసుకున్నట్టు సమాచారం.