జేడీ(యూ) అభ్యర్థిని ఎన్నికలకు ముందే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది...
ABN , First Publish Date - 2020-10-19T13:28:47+05:30 IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళా అభ్యర్థిని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన జగదీష్పూరులో వెలుగుచూసింది....

పాట్నా (బీహార్): బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ మహిళా అభ్యర్థిని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన జగదీష్పూరులో వెలుగుచూసింది. జగదీష్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఆర్జేడీ ఎమ్మెల్యే రంబిషున్ సింగ్ లోహియాకు వ్యతిరేకంగా సుషుమ్లతా కుష్యాహా జేడీ(యూ) అభ్యర్థినిగా ఎన్నికల బరిలో నిలిచారు. నిండు గర్భిణీ అయిన సుషుమ్లతా ఎన్నికలకు ముందే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం రాత్రి భోజ్ పూర్ నగరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. పాట్నాలోని ఆసుపత్రిలో ఉన్న జేడీయూ అభ్యర్థిని సుషుమ్లతా ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనలేక పోయారని, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అభ్యర్థినిని సీఎం నితీష్ కుమార్ అభినందించారు. చిన్నారి ఆడబిడ్డను నితీష్ సభలోనే వేదికపైనుంచి ఆశీర్వదించారు.
2012లో జేడీ(యూ) అభ్యర్థిని సుషుమ్లతాకు వివాహమైంది. ప్రపంచ బ్యాంకు సహాయక బీహార్ గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్టులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషించిన సుషుమ్లతాకు నితీష్ కుమార్ పార్టీ టికెట్ ఇచ్చారు. బీహార్ ఎన్నికల్లో విజయం సాధించే అభ్యర్థులందరూ రెండు నెలల్లోపు స్థానిక సమస్యలను పరిష్కరిస్తారని సీఎం నితీష్ కుమార్ హామీ ఇచ్చారు. భోజ్ పూర్ జిల్లాలోని జగదీష్పూర్ అసెంబ్లీ సీటుకు ఈ నెల 28వతేదీన పోలింగ్ జరగనుంది. జేడీ(యూ) అభ్యర్థిని ప్రసవం అనంతరం ఆసుపత్రిలో ఉండటంతో ఆమె తరపున జేడీయూ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.