వాహ్...‘అంగ్ కోర్ వాట్ ’... అతిపెద్ద హిందూ దేవాలయం...

ABN , First Publish Date - 2020-07-06T03:45:35+05:30 IST

అయిదు వందల ఎకరాల విస్తీర్ణం., 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరం., అద్భుతమైన శిల్పకళ., చుట్టూ శిఖరాలు., పచ్చని కళ... ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన ‘అంగ్‌కోర్ వాట్ ’ ప్రత్యేకతలు. వందల ఏళ్ల కిందటి ఈ అద్భుత దేవాలయం కాంబోడియాలో ఉంది. క్రీస్తుశకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో భాగం కాంబోడియా. ఆ సామ్రాజ్యం రాజధాని నగరం పేరు కూడా అంగ్‌కోర్.

వాహ్...‘అంగ్ కోర్ వాట్ ’... అతిపెద్ద హిందూ దేవాలయం...

ఫొంపెన్ : అయిదు వందల ఎకరాల విస్తీర్ణం., 65 మీటర్ల ఎత్తయిన భారీ శిఖరం., అద్భుతమైన శిల్పకళ., చుట్టూ శిఖరాలు.,  పచ్చని కళ... ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేవాలయమైన ‘అంగ్‌కోర్ వాట్ ’ ప్రత్యేకతలు. వందల ఏళ్ల కిందటి ఈ అద్భుత దేవాలయం కాంబోడియాలో ఉంది. క్రీస్తుశకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో భాగం కాంబోడియా. ఆ సామ్రాజ్యం రాజధాని నగరం పేరు కూడా అంగ్‌కోర్.


తొలుత ఈ సామ్రాజ్యాన్ని ఇతరులు పాలించినా.. అనంతరం హిందూ రాజుల పరిపాలనలోకి వచ్చింది. దీనిని కాంభోజ రాజ్యంగా పేర్కొనేవారు. యురోపియన్ల వలసల అనంతరం కాంబోడియాగా మారింది. అంగ్‌కోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు పేరు సూర్యవర్మన్-2. ఆయన విష్ణుమూర్తి ఆరాధకుడు. 


ప్రపంచంలోనే అతి పెద్ద నగరం... అంగ్‌కోర్ నగరంలో అప్పట్లోనే పది లక్షల మంది వరకు జనాభా ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ లెక్కన 19 వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చే నాటికి కూడా ప్రపంచంలో అతిపెద్ద నగరం అంగ్‌కోర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా కేవలం నగర ప్రధాన ప్రాంతంలోనే ఏకంగా ఐదు లక్షల వరకు ప్రజలు నివసించినట్టుగా గుర్తించారు. అంగ్‌కోర్‌వాట్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ‘మహేంద్ర పర్వత’గా పిలిచే మరో పెద్ద నగరం అవశేషాలను కూడా గుర్తించారు.


ప్రస్తుతం అంగ్‌కోర్‌వాట్ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి పరిరక్షిస్తోంది. ఆలయాల నగరం... అంగ్‌కోర్‌వాట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందల దేవాలయాలున్నాయి. అసలు అంగ్‌కోర్‌వాట్ అంటేనే...  దేవాలయాల నగరమని అర్థం. క్రీస్తు శకం 1113 సంవత్సరం నుంచి 1150 సంవత్సరాల మధ్య దీనిని నిర్మించినట్టు అంచనా. సుమారు 500 ఎకరాల్లో ఈ దేవాలయం విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అన్ని మతాలకు సంబంధించి కూడా  అంగ్‌కోర్‌వాట్ దేవాలయమే అతిపెద్దది కావడం గమనార్హం.


అంగ్‌కోర్‌వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో 213 అడుగుల(65 మీటర్ల) ఎత్తైన భారీ గోపురంతోపాటు దానికి నాలుగు పక్కలా కొంత చిన్నగా మరో నాలుగు గోపురాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి చుట్టూ పలు చిన్న ఆలయాలున్నాయి. - దేవాలయం చుట్టూ అతిపెద్ద నీటి కందకం ఉండటం ఈ ఆలయ విశేషాల్లో ఒకటి. ఏకంగా 650 అడుగుల(200 మీటర్లు) వెడల్పుతో 13 అడుగుల(నాలుగు మీటర్ల) లోతుతో ఆలయం చుట్టూరా ఉన్న ఈ కందకం ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. దీని మొత్తం చుట్టుకొలత ఏకంగా ఐదు కిలోమీటర్లకు పైనే ఉండడం గమనార్హం.


ఆలయానికి పశ్చిమ, తూర్పు దిశల్లో ప్రవేశ మార్గాలున్నాయి. ప్రవేశించే చోట రాజగోపురాలు ఏర్పాటు చేశారు. ఇందులో పశ్చిమ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారానికి ఇరువైపులా గంభీరంగా ఉండే సింహాల శిల్పాలు ఉంటాయి. ద్వారం నుంచి ప్రధాన ఆలయం వరకు రాతి కట్టడంతో మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో ప్రత్యేకతలతో ఉట్టిపడే ఈ దేశాలయం ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. 


Updated Date - 2020-07-06T03:45:35+05:30 IST