భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వానికి మద్దతు : బైడెన్ క్యాంప్

ABN , First Publish Date - 2020-11-25T20:28:25+05:30 IST

చైనాను ఎదుర్కొనడంలో అమెరికాకు భారత దేశం కీలక భాగస్వామి

భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వానికి మద్దతు : బైడెన్ క్యాంప్

వాషింగ్టన్ : చైనాను ఎదుర్కొనడంలో అమెరికాకు భారత దేశం కీలక భాగస్వామి అని అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్ శిబిరం తెలిపింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం లభించేందుకు అమెరికా మద్దతిస్తుందని పేర్కొంది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవికి బైడెన్ ఎంపిక చేసిన నేత ఆంటోనీ బ్లింకెన్ మొట్టమొదటిసారి భారత దేశం గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఈ విషయాలు తెలిపారు. 


ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం మాట్లాడుతూ, అత్యంత దూకుడుగా ఉన్న చైనాను ఎదుర్కొనడం భారత్, అమెరికాలకు ఉన్న ఉమ్మడి సవాలు అని తెలిపారు. భారత దేశంపైనా, వాస్తవాధీన రేఖ వద్ద చైనా దురాక్రమణ విధానంతో వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, భారత దేశంతో ప్రజాస్వామిక సంబంధాలను నవీకరించేందుకు కృషి చేస్తారన్నారు. అమెరికాకు భారత దేశం సన్నిహిత భాగస్వామి అని తెలిపారు. భారత దేశంతో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సన్నిహితంగా పని చేస్తుందన్నారు. బరాక్ ఒబామా - జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సమయంలో ఇండో-పసిఫిక్ స్ట్రాటజీకి కీలక భాగస్వామిగా భారత దేశాన్ని నిలిపేందుకు తాము విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంస్థల్లో భారత దేశానికి ప్రముఖ పాత్ర లభించే విధంగా జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కృషి చేస్తుందన్నారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారత దేశానికి స్థానం (శాశ్వత సభ్యత్వం) లభించే విధంగా మద్దతు ఇస్తుందన్నారు. 


ఇదిలావుండగా, ఈ ఏడాది మే నెల నుంచి భారత్-చైనా మధ్య తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.Read more