భారత్ బంద్‌.. దేశవ్యాప్తంగా కొనసాగుతోందిలా..!

ABN , First Publish Date - 2020-09-25T18:33:37+05:30 IST

బిహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆధ్వర్యంలో వ్యవసాయ బిల్లులపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి వ్యవసాయ బిల్లులపై నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రైతులు నిరసనలు చేపట్టారు

భారత్ బంద్‌.. దేశవ్యాప్తంగా కొనసాగుతోందిలా..!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బిల్లులను రైతు వ్యతిరేక బిల్లులుగా పరిగణిస్తూ ఈరోజు పంజాబ్ రాష్ట్రం సంపూర్ణ బంద్‌ పాటిస్తోంది. కాగా హర్యానా, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.


బిహార్‌లో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆధ్వర్యంలో వ్యవసాయ బిల్లులపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి వ్యవసాయ బిల్లులపై నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రైతులు నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వాలని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు. ఢిల్లీ-మీరట్ హైవే మూసివేయడంతో వందల సంఖ్యలో చేరుకున్న రైతులు అక్కడే ధర్నా నిర్వహించారు.


హర్యానాలో రైతుల నిరసన పెద్ద ఎత్తున కొనసాగుతోంది. కాగా పంజాబ్-హర్యానా సరిహద్దును పోలీసులు మూసి వేశారు. పంజాబ్ నుంచి వస్తున్న రైతు నిరసన ట్రాక్టర్లను సరిహద్దులోనే అడ్డుకుని హర్యానాలోకి ప్రవేశించకుండా నిలువరించారు.


ఇక పంజాబ్‌లో రైతుల నిరసన ఉదృతంగా సాగుతోంది. ఈ నిరసనకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. పంజాబ్‌లోని రోడ్లన్నీ రైతుల ట్రాక్టర్ల ర్యాలీలతో నిండిపోయాయి. కాగా, రైతు నిరసనలపై ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, నిరసనల్లో ఎలాంటి అసాంఘీక ఘటనలు జరగలేదని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. చాలా ప్రాంతాల్లో రైలు ప్రాయాణాలను రైతులు అడ్డుకున్నారు. రైల్వే లైన్‌లపై బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.


అయితే బిహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులను అరెస్ట్ చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. చట్టబద్దంగా చేస్తున్న నిరసనలను స్థానిక ప్రభుత్వాలు అణచివేయాలని చూస్తున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - 2020-09-25T18:33:37+05:30 IST