బెంగాల్ పోలీసులు వర్సెస్ బీజేపీ... కార్యకర్త మృతి
ABN , First Publish Date - 2020-12-07T23:19:23+05:30 IST
బెంగాల్‌లోని సిలిగూరీలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య సోమవారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో బీజేపీ కార్యకర్త ఒకరు మృతి

కోల్‌కతా : బెంగాల్‌లోని సిలిగూరీలో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య సోమవారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో బీజేపీ కార్యకర్త ఒకరు మృతి చెందారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ, దాని అనుబంధ విభాగమైన బీజేవైఎం సిలిగూరీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక అధికారులు 144 సెక్షన్ విధించారు. అయినా సరే బీజేపీ కార్యకర్తలు తమ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలపై వాటర్ కెనన్లు, టియర్ గ్యాస్ ను ఉపయోగించారు. దీంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పోలీసులు గట్టిగా కొట్టడంతోనే తమ కార్యకర్త ప్రాణాలు కోల్పోయారని బీజేపీ ఆరోపించింది.
అయితే దీనిపై అధికార టీఎంసీ స్పందించింది. బీజేపీ హింసనే నమ్ముతుందనడానికి ఇదే బహిరంగ నిదర్శనమని ఎంపీ సౌగత్ రాయ్ ఆరోపించారు. పోలీసులు కాల్పులు జరిపేలా బీజేపీ కార్యకర్తలే రెచ్చగొట్టారని, అయినా సరే పోలీసులు చక్కగా హ్యాండిల్ చేశారని ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలని బీజేపీ ప్లాన్ వేసిందని, అది విఫలమైందని సౌగతా రాయ్ మండిపడ్డారు.
పోలీసులు విసిరిన బాంబుల వల్లే : ఎంపీ తేజస్వీ సూర్య
ఈ ఘటనపై బెంగాల్ వ్యవహారాల పర్యవేక్షకుడు, ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. ‘‘ఇది హత్యే. అంతకు మించి ఏదీ కాదు. మేం చాలా కోపంగా ఉన్నాం. మమతా దీదీ... తమరిని ఎప్పటికీ మరిచిపోలేం. పోలీసులు విసిరిన బాంబుల వల్లే మా కార్యకర్త ఉలేన్ రాయ్ మరణించారని నాకు స్థానిక కార్యకర్తలు సమాచారం అందించారు.’’ అంటూ తేజస్వీ సూర్య తీవ్రంగా మండిపడ్డారు.
పోస్ట్‌మార్టం తర్వాతే నిజాలు తెలుస్తాయి : పోలీసులు
అయితే ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఓ రాజకీయ పార్టీ సిలిగూరిలో తీవ్రమైన హింసాకాండకు దిగిందని పేర్కొన్నారు. కార్యకర్తలను చెదరగొట్టడానికి తాము టియర్ గ్యాస్, వాటర్ కెనన్లు మాత్రమే వాడామని పోలీసులు తెలిపారు. అయితే ఈ సమయంలోనే ఓ కార్యకర్త మృత్యువాత పడినట్లు తమకు సమాచారం అందిందని, పోస్ట్‌మార్టం జరిగిన తర్వాతే అసలు విషయాలు బయటికి వస్తాయని పోలీసులు పేర్కొన్నారు.