సువేందు రాజీనామాకు బెంగాల్ గవర్నర్ ఆమోదం
ABN , First Publish Date - 2020-11-28T04:45:14+05:30 IST
రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటూ తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సువేందు అధికారి సమర్పించిన రాజీనామాను ...

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి సువేందు అధికారి సమర్పించిన రాజీనామాను ఆమోదించినట్టు పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్ శుక్రవారం వెల్లడించారు. సీఎం మమతా బెనర్జీ ‘‘సిఫారసు’’ మేరకు తాను ఆమోదం తెలిపినట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు సువేందు పర్యవేక్షణలో ఉన్న నాలుగు శాఖలు ఇకపై ముఖ్యమంత్రి పర్యవేక్షణలో కొనసాగుతాయని గవర్నర్ తెలిపారు. ఈ మేరకు గవర్నర్ ఇవాళ సాయంత్రం తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు. టీఎంసీ నేతల్లో అత్యంత ప్రముఖుడిగా పేరున్న సువేందు అధికారి.. ఇవాళ రవాణ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందు నిన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని హుగ్లీ రివర్ బ్రిడ్జి కమిషనర్స్ చైర్మన్ పదవికి కూడా గుడ్‌బై చెప్పారు. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికలు ముంగిట ఆయన బయటికి వెళ్లకుండా బుజ్జగించేందుకు ఆ పార్టీ నేతలు తెరవెనుక చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టినట్టైంది.