కరోనాపై గెలిచే వరకు మన ఇళ్లే మజీద్, గుడి, గురుద్వార్: సీఎం మమత
ABN , First Publish Date - 2020-04-25T22:32:41+05:30 IST
కరోనా కాలంలో రాష్ట్ర ప్రజల్లో ధైర్యం నింపేందుకు బెంగాల్ సీఎం మమత బెనర్జీ రోడ్డెక్కారు. నాలుగు రోజులుగా...

కోల్‌కత: కరోనా కాలంలో రాష్ట్ర ప్రజల్లో ధైర్యం నింపేందుకు బెంగాల్ సీఎం మమత బెనర్జీ రోడ్డెక్కారు. నాలుగు రోజులుగా ఆమె అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. ఈ నేపథ్యలో కలకత్తాలోని రెండు ప్రాంతాల్లో ఈ రోజు మమత పర్యటించారు. లాక్‌డౌన్ నేపథ్యలో అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని, ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ,‘కరోనాపై మనం విజయం సాధించేవరకు మన ఇళ్లే మనకు మజిద్, గుడి, గురుద్వారా. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోండి. దేవుడి ప్రార్థనలు మీ ఇంటినుంచే చేయండి’ అని ప్రజలను కోరారు. రాష్ట్రంలో 100 మంది వరకు కరోనా బాధితులు కోలుకున్నారని, ఇది ఎంతో సంతోషించాల్సిన విషయమని, మిగిలిన వారు కూడా త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నానని సీఎం మమత పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సీఎం మమత బెనర్జీ రాష్ట్రంలోని ముస్లింలందరికీ ఈ రోజు ఉదయం శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని, శాంతి, సహృద్భావంతో మెలగాలని కోరారు.