బెలారస్‌లో ప్రారంభమైన స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్

ABN , First Publish Date - 2020-12-29T22:09:20+05:30 IST

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ బెలారస్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఆ దేశంలో నేటి నుంచి వ్యాక్సినేషన్

బెలారస్‌లో ప్రారంభమైన స్పుత్నిక్-వి వ్యాక్సినేషన్

మాస్కో:  రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘స్పుత్నిక్-వి’ బెలారస్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఆ దేశంలో నేటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఫలితంగా రష్యా వెలుపల స్పుత్నిక్‌ను ఉపయోగిస్తున్న తొలి దేశంగా బెలారస్ రికార్డులకెక్కింది. ఇక్కడ మొత్తం 9.5 మిలియన్ల మంది నివసిస్తున్నారు. 1.88 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. 1,400 మంది చనిపోయారు. ఈ రోజు బెలారస్‌కు తొలి వ్యాక్సిన్ షిప్‌మెంట్ చేరుకున్నట్టు వ్యాక్సిన్ తయారీ సంస్థ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) తెలిపింది. అయితే, బెలారస్‌కు ఎన్ని డోసులు పంపిందీ మాత్రం వెల్లడించలేదు.  


స్పుత్నిక్ టీకా తొలి డోసును ఆరోగ్య కార్యకర్తలు, టీచర్లకు ఇవ్వనున్నట్టు బెలార్ ఆరోగ్యశాఖ మంత్రి డిమిట్రీ పినెవిక్ తెలిపారు. కరోనా సమస్యను పరిష్కరించేందుకు క్రియాశీల కార్యాచరణ, వ్యూహాత్మక సహాయసహకారాలు అందించినందుకు ఈ సందర్భంగా రష్యాకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్‌డీఐఎఫ్ జనరల్ డైరెక్టర్ కిరిల్ డిమిడ్రియేవ్ మాట్లాడుతూ.. సోవియట్ యూనియన్ మాజీ దేశమైన బెలారస్‌లోనూ వ్యాక్సిన్ తయారీని ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలిపారు.  

Updated Date - 2020-12-29T22:09:20+05:30 IST