రాగులిస్తే.. బియ్యం, పాలకు.. ఆకుకూరలు.. మైసూరులో ఇదీ పరిస్థితి

ABN , First Publish Date - 2020-04-01T22:22:50+05:30 IST

దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనాను అరికట్టేందుకు 21 రోజులపాటు లాక్‌‌డౌన్ విధించడంతో.. నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. దీన్ని

రాగులిస్తే.. బియ్యం, పాలకు.. ఆకుకూరలు.. మైసూరులో ఇదీ పరిస్థితి

మైసూరు: దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనాను అరికట్టేందుకు 21 రోజులపాటు లాక్‌‌డౌన్ విధించడంతో.. నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు పట్టణాల్లో ఉన్న ప్రజలు డెలివరీ యాప్స్, ఈ-టేలర్స్ తదితర టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కానీ, పాత మైసూరులోని ప్రజలు మాత్రం నిత్యావసర వస్తువుల కోసం పాతకాలం నాటి వస్తు వినిమయ విధానాన్ని పాటిస్తున్నారు. 


లాక్‌డౌన్ విధించి వారం రోజులు పూర్తైన విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతంలోని గ్రామాలకు చెందిన ప్రజలు తమ వద్ద ఉన్న ధాన్యం, మిల్లెట్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులను అవసరమున్న వారికి ఇచ్చి.. వారి వద్ద నుంచి తమకు అవసరమైన వస్తువులను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కర్ణాటక రాజ్య రైతు సంఘ అధ్యక్షుడు బడగలపురా నాగేంద్ర మాట్లాడుతూ.. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది వద్ద నగదు కొరత ఏర్పడింది. దీంతో మేము వస్తువుల వినిమయం చేయాలని నిర్ణయించుకన్నాము. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు అందరూ దాదాపు ఇదే విధానాన్ని పాటిస్తున్నారు’’ అని తెలిపారు. 


ఈ విధానం కొంత సమయంలోనే ట్రెండ్‌లోకి వచ్చింది. ‘‘బియ్యం పడించిన వ్యక్తి వాటిని ఇచ్చి అందుకు తగిన రాగిని తీసుకుంటున్నాడు. కూరగాయలు, పాలు, ఇతర సరుకులు వాటి రేటును బట్టి వినిమయం చేసుకుంటున్నారు’’ అని నాగేంద్ర స్పష్టం చేశారు. నంజన్‌గుడ్ నుంచి హెడ్‌డీ కోటే మధ్యలో ఉన్న 400 గ్రామాల్లో ప్రస్తుతం ఇదే విధానం అమలులో ఉందని ఆయన అన్నారు. తమ వద్ద ఎటువంటి నిత్యావసర వస్తువులు లేనివాళ్లు కూలీ పని చేసి వాటిని సంపాదించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా రైతులకు అందాల్సిన డబ్బు ఇంకా అందలేదని చెప్పిన ఆయన.. మరో మార్గం లేక ఈ విధానాన్ని అమలులోకి తెచ్చామని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-04-01T22:22:50+05:30 IST