కర్ణాటకలో గుట్కా, పాన్‌ మసాలాలపై నిషేధం

ABN , First Publish Date - 2020-08-01T08:44:44+05:30 IST

గుట్కా, పాన్‌ మసాలా ప్యాకెట్‌ల ముసుగులో అత్యంత ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు

కర్ణాటకలో గుట్కా, పాన్‌ మసాలాలపై నిషేధం

త్వరలో ఆర్డినెన్స్‌- సీఎం యడియూరప్ప


బెంగళూరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): గుట్కా, పాన్‌ మసాలా ప్యాకెట్‌ల ముసుగులో అత్యంత ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న అంశం వెలుగు చూసిందని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప పేర్కొన్నారు. బెంగళూరులో శుక్రవారం ఆయన హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో కలసి గవర్నర్‌ వాజుభాయ్‌వాలాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరులో మాదకద్రవ్యాల ముఠాలు పేట్రేగిపోతున్న అంశంపైనే గవర్నర్‌తో చర్చించినట్టు సమాచారం. భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో కొద్దిరోజుల క్రితం ప్రమాదకరమైన మాదక్రవ్యాలు స్వాధీనం చేసుకున్నప్పుడు ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయన్నారు.


కేరళకు చెందిన నలుగురు సభ్యుల ముఠాను విచారించగా పొగాకు ఉత్పత్తులు, గుట్కా, పాన్‌మసాలా సాచెట్‌లలో మాదకద్రవ్యాలు కలిపి విక్రయిస్తున్నట్టు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే పొగాకు ఉత్పత్తులన్నింటినీ నిషేధిస్తూ ఆర్డినెన్స్‌ జారీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. రాజధాని నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంపై కూడా గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారని యడియూరప్ప వెల్లడించారు. ప్రజల్లో రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని పెంపొందించేందుకు ఆయుర్వేద ఔషధాలను విరివిగా వినియోగించాలని గవర్నర్‌ సూచించారని, ఈ దిశగా పరిశీలిస్తున్నామన్నారు.

Updated Date - 2020-08-01T08:44:44+05:30 IST