చైనీస్ ఫుడ్ ను అమ్మే రెస్టారెంట్లను బ్యాన్ చేయాలి: కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-06-18T20:30:18+05:30 IST

చైనీస్ ఫుడ్ ను విక్రయించే రెస్టారెంట్లపై భారత్ లో నిషేధం విధించాలని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే డిమాండ్ చేశారు. అన్యాయంగా 20 మంది భారత జవాన్లను చైనా పొట్టనపెట్టుకుందని ఆయన వాపోయారు.

చైనీస్ ఫుడ్ ను అమ్మే రెస్టారెంట్లను బ్యాన్ చేయాలి: కేంద్ర మంత్రి వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: చైనీస్ ఫుడ్ ను విక్రయించే రెస్టారెంట్లపై భారత్ లో నిషేధం విధించాలని కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావలే డిమాండ్ చేశారు. అన్యాయంగా 20 మంది భారత జవాన్లను చైనా పొట్టనపెట్టుకుందని ఆయన వాపోయారు. ప్రజలంతా స్వచ్ఛందంగా చైనా ఆహార పదార్థాలను, వాటిని అమ్మే రెస్టారెంట్లను బాయ్ కాట్ చేయాలని కోరారు. ఆహార పదార్థాలే కాకుండా.. చైనాలో తయారయిన అన్ని రకాల వస్తువులను వదిలించుకోవాల్సిన తరుణం వచ్చిందన్నారు.


చైనా వస్తువులను వాడొద్దని, వాటిపై నిషేధం విధించాలన్న డిమాండ్ ఓ వర్గం నుంచి వినిపిస్తూనే ఉంది.. ప్రస్తుతం చైనా, భారత్ మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణంలో ఈ డిమాండ్ కు మరింత ఊతం లభిస్తోంది. ఈ తరుణంలో కేంద్రమంత్రి రామ్ దాస్ అథావలే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చైనాకు వ్యతిరేకంగా.. చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారత్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఉత్తర ప్రదేశ్ లోని గోరక్ పూర్ లో చైనాకు, ఆ దేశ ఉత్పత్తులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ దిష్టిబొమ్మను పలు చోట్ల దహనం చేశారు. 


తాజాగా బీహార్ లోనూ గురువారం పలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. బీహార్ రాజధాని పాట్నాలో జన్ అధికార్ పార్టీ చీఫ్ పప్పూ యాదవ్ చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జేసీబీ మెషీన్ ను ఎక్కి మరీ ఓ ప్రముఖ చైనా మొబైల్ కంపెనీకి సంబంధించిన అతి పెద్ద బోర్డింగ్ పై.. నల్లరంగును పూశారు.  

Updated Date - 2020-06-18T20:30:18+05:30 IST