వరి పండించడంపై నిషేధాన్ని సాంఘిక సంస్కరణ అంటున్న హర్యానా మంత్రి

ABN , First Publish Date - 2020-05-13T21:53:03+05:30 IST

హర్యానాలో కొన్ని చోట్ల వరి పండించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

వరి పండించడంపై నిషేధాన్ని సాంఘిక సంస్కరణ అంటున్న హర్యానా మంత్రి

చండీగఢ్ : హర్యానాలో కొన్ని చోట్ల వరి పండించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ‘మేరా పానీ, మేరీ విరాసత్’ పథకంలో భాగంగా దీనిని అమలు చేస్తున్నారు. ఇది సాంఘిక సంస్కరణ అని ఆ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి జేపీ దలాల్ అన్నారు. 


హర్యానా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, హర్యానాలో వరి పండించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఏటా ఒక మీటరు వరకు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఒక కేజీ వరి పండించడానికి దాదాపు 2,000 నుంచి 5,000 లీటర్ల వరకు నీరు అవసరమవుతోంది. 


ఈ నేపథ్యంలో ఇటీవలే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ ‘మేరా పానీ, మేరీ విరాసత్’ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ఎనిమిది బ్లాకుల్లో వరి పండించడంపై నిషేధం విధించారు.


వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి జేపీ దలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎనిమిది బ్లాకుల్లో వరి పండించడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ చర్య నీటి సంరక్షణ కోసం అమలు చేస్తున్న సాంఘిక సంస్కరణ అని పేర్కొన్నారు. వరి పండించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని,  ఏటా ఒక మీటరు వరకు భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని తెలిపారు. ఒక కేజీ వరి పండించడానికి దాదాపు 2,000 నుంచి 5,000 లీటర్ల వరకు నీరు అవసరమవుతోందన్నారు. నీటిని ఆదా చేయడానికి ఈ సంస్కరణలను అమలు చేయవలసి ఉందన్నారు.


Read more