బాల గంగాధర తిలక్‌తో స్వాతంత్ర్య పోరాటానికి భారతీయత : అమిత్ షా

ABN , First Publish Date - 2020-08-01T20:27:51+05:30 IST

లోకమాన్య బాల గంగాధర తిలక్ స్వాతంత్ర్య పోరాటానికి నిజమైన భారతీయతను

బాల గంగాధర తిలక్‌తో స్వాతంత్ర్య పోరాటానికి భారతీయత : అమిత్ షా

న్యూఢిల్లీ : లోకమాన్య బాల గంగాధర తిలక్ స్వాతంత్ర్య పోరాటానికి నిజమైన భారతీయతను తీసుకొచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. గత కాలపు ఘనత లేకుండా భవిష్యత్తులోకి పురోగించలేమని, తిలక్ ఎల్లప్పుడూ ఇదే విషయం చెప్పేవారని అన్నారు. 


బాల గంగాధర తిలక్ 100వ వర్థంతి సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన వెబినార్ ప్రారంభ సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. భారత దేశ స్వాతంత్ర్యాన్ని భారతీయం చేసినవారు ఎవరైనా ఉన్నారా, అంటే, ఆ వ్యక్తి తిలక్ అని చెప్పారు. కాంగ్రెస్ చరిత్రను చదివినవారికి ఈ విషయం తెలుస్తుందన్నారు. 


భారతీయ ఆలోచనలు, భారతీయ చరిత్ర, భారతీయ ఘనత, వివిధ భాషలను స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేశపెట్టిన నేత తిలక్ అని చెప్పారు. ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అని, ‘దానిని నేను తీసుకుంటాను’ అని గట్టిగా నినదించారని చెప్పారు. దీంతో అప్పటి వరకు జరిగిన స్వాతంత్ర్యోద్యమం నమూనా పూర్తిగా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమం ప్రజల ఉద్యమంగా మారిందన్నారు. 


తిలక్ ఓ వైపు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే, మరో వైపు గోవధకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడారని, ‘కేసరి’ వార్తా పత్రికను నడిపారని చెప్పారు. శివాజీ జయంతి, గణపతి ఉత్సవాలను ప్రజా ఉద్యమంగా మార్చిన ఘనత తిలక్‌దేనని తెలిపారు. 


శివాజీ మహరాజ్ విలువలను ప్రజలకు చేర్చినవారు ఎవరైనా ఉన్నారా, అంటే, ఆ నేత తిలక్ అని చెప్పారు. మహాత్మా గాంధీ, వీర్ సావర్కర్, మదన్ మోహన్ మాలవీయల గురించి చదివితే, వారిపై తిలక్ ప్రభావం స్పష్టంగా తెలుస్తుందన్నారు. 


తిలక్ సిద్ధాంతాలు నేటికీ ప్రయోజనకరమేనని, ఆయన గురించి చదవాలని యువతను కోరారు. 


Updated Date - 2020-08-01T20:27:51+05:30 IST