కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: శివశంకర్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

ABN , First Publish Date - 2020-12-31T05:06:48+05:30 IST

కేరళ సీఎంవో మాజీ ముఖ్య కార్యదర్శి ఎం. శివశంకర్‌కు బెయిల్ ఇచ్చేందుకు అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ...

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: శివశంకర్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

కొచ్చి: కేరళ సీఎంవో మాజీ ముఖ్య కార్యదర్శి ఎం. శివశంకర్‌కు బెయిల్ ఇచ్చేందుకు అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు (ఆర్థిక నేరాల విభాగం) తిరస్కరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి దాఖలైన మనీ ల్యాండరింగ్ కేసులో శివశంకర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కస్టమ్స్ శాఖ నమోదు చేసిన ఈ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌‌ను కోర్టు కొట్టివేసింది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న స్వప్న సురేశ్‌తో కలిసి శివశంకర్ ఏడుసార్లు యూఏఈ వెళ్లివచ్చారని, కస్టమ్స్ శాఖ బుధవారం ధర్మాసనానికి నివేదించింది. ‘‘మొత్తం ఏడుసార్లు వారిద్దరూ యూఏఈలోని ఫైవ్ స్టార్ హోటళ్లలోనే గడిపారు. అందుకు అవసరమైన ఖర్చులన్నీ శివశంకర్ వ్యక్తిగతంగా ఏర్పాటు చేశారు. రహస్య ఉద్దేశ్యాలతోనే ఈ ట్రిప్పులన్నీ తిరిగారు. దీనిపైనే కస్టమ్స్ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకేదేశానికి ఇన్నిసార్లు ప్రయాణించడం ఎప్పుడూ జరగదు..’’ అని కస్టమ్స్ విభాగం పేర్కొంది. శివశంకర్ సాయంతో గోల్డ్ స్మగ్లింగ్ కార్యకలాపాలు జరగడం వల్ల భారత్, యూఏఈల మధ్య స్నేహం దెబ్బతిందనీ.. ఎంతో మంది భారతీయులకు యూఏఈ ఉపాధి కల్పిస్తోందని కస్టమ్స్ శాఖ గుర్తుచేసింది. 

Updated Date - 2020-12-31T05:06:48+05:30 IST