బాబా రామ్‌దేవ్ ‘కరోనా మందు’కు ఆయుష్ మంత్రిత్వ శాఖ బ్రేకులు

ABN , First Publish Date - 2020-06-24T02:10:14+05:30 IST

ప్రపంచమంతా కోవిడ్-19 మహమ్మారికి మందు కోసం ఎదురు చూస్తున్న

బాబా రామ్‌దేవ్ ‘కరోనా మందు’కు ఆయుష్ మంత్రిత్వ శాఖ బ్రేకులు

న్యూఢిల్లీ : ప్రపంచమంతా కోవిడ్-19 మహమ్మారికి మందు కోసం ఎదురు చూస్తున్న వేళ యోగా గురువు బాబా రామ్‌దేవ్ నేతృత్వంలోని పతంజలి గ్రూప్ ఓ మందును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ మందును ప్రచారం చేయడంపై కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది.  ఈ అంశంపై పరిశీలన జరిపే వరకు ఎటువంటి ప్రకటనలు జారీ చేయరాదని స్పష్టం చేసింది. 


డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (అబ్జెక్షనబుల్ అడ్వర్టయిజ్‌మెంట్స్) యాక్ట్ , 1954 పరిథిలోకి పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ చెప్తున్న మందులు వస్తాయని వివరించింది. 


‘కొరోనిల్’, ‘శ్వాసరి’ అనే మందులను హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీఠ్‌లో కొందరు కోవిడ్-19 రోగులపై ప్రయోగాత్మకంగా పరీక్షించామని పతంజలి గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో నూటికి నూరు శాతం సానుకూల ఫలితాలు వచ్చినట్లు కూడా పేర్కొంది. 


కోవిడ్-19ను  నయం చేయడానికి తయారైన తొలి ఆయుర్వేద మందులు ఇవేనని బాబా  రామ్ దేవ్ చెప్పారు. 


ఈ నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, పతంజలి చెప్తున్న విషయాలు తమ దృష్టికి రాలేదని పేర్కొంది. ఈ మందుల పేర్లు, వాటిలో ఉపయోగించిన మిశ్రమాల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఈ మందులను ఎక్కడ పరిశీలించారు? పరిశోధన ఎక్కడ, ఏవిధంగా జరిగింది? వంటి వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. ఈ మందులకు అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేసిన లైసెన్స్ కాపీలను సమర్పించాలని ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీని   కోరింది.


ఈ మందులకు సంబంధించిన ప్రకటనలను జారీ చేయరాదని కూడా పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌ను ఆదేశించింది. 


Updated Date - 2020-06-24T02:10:14+05:30 IST