వెంటిలేటర్లు తయారుచేయండి: వాహన ఉత్పత్తిదారులను కోరిన కేంద్రం

ABN , First Publish Date - 2020-03-30T22:15:26+05:30 IST

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా వెంటిలేటర్లు ఉత్పత్తి చేయాల్సిందిగా దేశంలోని వాహన తయారీ కంపెనీలను ప్రభుత్వం

వెంటిలేటర్లు తయారుచేయండి: వాహన ఉత్పత్తిదారులను కోరిన కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో భాగంగా వెంటిలేటర్లు ఉత్పత్తి చేయాల్సిందిగా దేశంలోని వాహన తయారీ కంపెనీలను ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం 14 వేల వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇప్పటికే కరోనా రోగుల కోసం వినియోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 1000 దాటిన నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్ అవసరాల కోసం పెద్ద ఎత్తున వెంటిలేటర్లు అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే వెంటిలేటర్లు ఉత్పత్తి చేయాల్సిందిగా ఆటోమొబైల్ కంపెనీలను కోరింది. ప్రస్తుతం రోజుకు 50 వేల ఎన్-95 మాస్కులు ఉత్పత్తి అవుతున్నాయని, వచ్చే వారం నాటికి లక్షకు పెంచుతామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  


కరోనా వైరస్‌పై పోరులో కీలకంగా మారిన మాస్కులు, వెంటిలేటర్ల ఉత్పత్తిపై దృష్టిసారించినట్టు దేశంలోని అతిపెద్ద ఆటో మేకర్ అయిన మారుతి సుజుకి శనివారమే పేర్కొంది. మరో ఆటో మొబైల్ సంస్థ మహింద్ర అండ్ మహింద్ర కూడా ముందుకొచ్చింది. ఆరోగ్య కార్యకర్తల కోసం ‘ఫేస్ షీల్డ్స్’ను తీసుకొచ్చింది. త్వరలోనే వెంటిలేటర్లను కూడా తీసుకురాబోతోంది. దక్షిణ కొరియా నుంచి టెస్టింగ్ కిట్‌లను కొనుగోలు చేస్తున్నట్టు హ్యుందయ్ మోటార్స్ ఇండియా సీఎస్ఆర్ వింగ్ ఇప్పటికే తెలిపింది. ప్రపంచ ప్రఖ్యాత ఆటోమేకర్లు అయిన ఫోర్డ్, జీఎం, టెస్లా వంటి  సంస్థలు అమెరికాలో వెంటిలేటర్ల తయారీకి ముందుకొచ్చాయి. పలు ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్సరర్లు (ఓఈఎంస్) కూడా యూకేలో వెంటిలేటర్లు ఉత్పత్తి చేయబోతున్నట్టు ప్రకటించాయి. 

Updated Date - 2020-03-30T22:15:26+05:30 IST