హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌పై దాడి... తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2020-05-29T19:57:05+05:30 IST

శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌పై పాకిస్థాన్‌లో దాడి జరిగింది.

హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌పై దాడి... తీవ్ర గాయాలు

శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌పై పాకిస్థాన్‌లో దాడి జరిగింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇస్లామాబాద్‌లో మే 25 మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడి వెనుక పాక్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ ఉన్నట్లు సమాచారం. సయ్యద్ సలావుద్దీన్ ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. సయ్యద్ సలావుద్దీన్‌తో ఐఎస్ఐకి విభేదాలు తలెత్తినట్లు సమాచారం. జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హతమవుతుండటంతో పాటు సరిహద్దు ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి అడుగు పెట్టలేకపోతుండటంపై ఐఎస్ఐ కొంత కాలంగా సయ్యద్ సలావుద్దీన్‌పై గుర్రుగా ఉందని సమాచారం. దీనికి తోడు కొత్తగా రిక్రూట్‌మెంట్లు లేకపోవడంపై కూడా ఐఎస్ఐ అసంతృప్తికి కారణమని తెలుస్తోంది. గత 20 సంవత్సరాలుగా సయ్యద్ సలావుద్దీన్‌ను పాక్ పెంచి పోషించింది. 


హిజ్బుల్ కమాండర్ రియాజ్ నైకూ హతమైనప్పుడు సయ్యద్ సలావుద్దీన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ సర్కారుకు ఆగ్రహం తెప్పించినట్లు భావిస్తున్నారు. పాకిస్థాన్ సర్కారు బలహీన విధానాల వల్ల భారత్ బలంగా దాడులు చేయగలుగుతోందని సయ్యద్ సలావుద్దీన్ వ్యాఖ్యానించడమే అతడిపై దాడికి కారణమని రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. 


1946 ఫిబ్రవరి 18న జమ్మూకశ్మీర్‌లోని బద్గామ్‌లో జన్మించిన సయ్యద్ సలావుద్దీన్ కశ్మీర్ యూనివర్సిటీలో ఎంఏ చదివాడు. జమ్మూ కశ్మీర్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత  ఉగ్రవాదంవైపు మళ్లాడు. పాకిస్థాన్‌కు మకాం మార్చుకున్నాడు. భారత్‌ను అస్థిరం చేసేందుకు నిరంతరం కుట్రలు పన్నేవాడు. కశ్మీరీ యువకులను పెద్ద సంఖ్యలో ఉగ్రవాద గ్రూపుల్లో చేర్పించడం, సరిహద్దు దాటించడం,  ఇండియన్ ఆర్మీపై పెద్ద ఎత్తున దాడులు చేయించడం సయ్యద్ సలావుద్దీన్ కనుసన్నల్లో జరిగేవి. 


సయ్యద్ సలావుద్దీన్ కుమారులంతా జమ్మూకశ్మీర్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కూడా. 

Updated Date - 2020-05-29T19:57:05+05:30 IST