110 రోజుల తర్వాత అదుపులోకి వచ్చిన చమురుబావిలోని మంటలు

ABN , First Publish Date - 2020-09-13T23:47:15+05:30 IST

అసోంలోని టిన్సుకియా జిల్లా బాగ్‌జన్ చమురు బావి 5లో చెలరేగిన మంటలు ఎట్టకేలకు 110 రోజుల తర్వాత అదుపులోకి వచ్చాయి.

110 రోజుల తర్వాత అదుపులోకి వచ్చిన చమురుబావిలోని మంటలు

గువాహటి: అసోంలోని టిన్సుకియా జిల్లా బాగ్‌జన్ చమురు బావి 5లో చెలరేగిన మంటలు ఎట్టకేలకు 110 రోజుల తర్వాత అదుపులోకి వచ్చాయి. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) ప్రకారం.. మంటలు అదుపు చేయడంలో ఎదురుదెబ్బల తర్వాత విదేశీ నిపుణులు గ్యాస్‌ను రెండు మండుతున్న బావుల్లోకి మళ్లించగలిగారు.


మిగతా దానిని ఈపీఎస్ (ఎర్లీ ప్రొడక్షన్ సిస్టం)లోకి ఆదివారం మళ్లించగలిగారని అధికారులు తెలిపారు. ఫలితంగా మంటలు అదుపులోకి వచ్చాయి. ఇది చాలా కష్టమైన పద్ధతని, సహజవాయును విజయవంతంగా మళ్లించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయని ఓఐఎల్ అధికార ప్రతినిధి తెలిపారు. చమురు లేకపోవడంతో మంటలు కూడా ఆగిపోయానని ఆయన వివరించారు.


తదుపరి దశలో ఆ బావిని మూసివేయనున్నట్టు తెలిపారు. బావిపై ఒత్తిడి, సంబంధిత విషయాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. బావిని మూసివేసే పనులు ఒకసారి ప్రారంభమైతే మిగతా వన్నీ వాటంతట అవే సర్దుకుంటాయన్నారు. కాగా, మే 27న చమరు బావిలో మంటలు చెలరేగాయి. అప్పటి నుంచి సహజవాయువు ఉద్గారాలు వెలువడుతూనే ఉన్నాయి.


మంటలను అదుపు చేసేందుకు నిపుణులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. మంటలు అదుపు చేసే ప్రయత్నంలో జూన్ 9న ఓఐఎల్‌కు చెందిన ఇద్దరు ఫైర్ ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. సైట్‌లో విద్యుదాఘాతం కారణంగా గత వారం 25 ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజినీర్ మృతి చెందాడు. ఆరుగురు విదేశీ నిపుణుల్లో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు.   

Updated Date - 2020-09-13T23:47:15+05:30 IST