కొవిడ్-19 వ్యాప్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే అరెస్ట్..

ABN , First Publish Date - 2020-04-07T20:41:23+05:30 IST

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ ఎమ్మెల్యేని అసోం పోలీసులు అరెస్ట్ చేశారు..

కొవిడ్-19 వ్యాప్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎమ్మెల్యే అరెస్ట్..

దిస్పూర్: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ ఎమ్మెల్యేని అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. దింగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లామ్‌ వ్యాఖ్యలపై ఫిర్యాదు అందడంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ‘‘మత విద్వేష వ్యాఖ్యలతో కూడిన ఓ ఆడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్టు అమీనుల్ ఇస్లామ్‌పై నాగావ్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. దీనిపై అదే రోజు ఎమ్మెల్యేను ప్రశ్నించాం. విచారణ సందర్భంగా ఈ ఆడియో క్లిప్‌లోని స్వరం తనదేననీ.. ఉద్దేశ్యపూర్వకంగానే దీన్ని తయారు చేశానని ఎమ్మెల్యే అంగీకరించారు...’’ అని నాగావ్ జిల్లా ఎస్పీ గౌరవ్ అభిజిత్ దిలీప్ పేర్కొన్నారు. ఆయన ఫోన్‌లో సదరు ఆడియో క్లిప్ ఉన్నట్టు గుర్తించి, దాన్ని సీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. 


ఈ ఆడియో క్లిప్‌ను ఎమ్మెల్యే అనేక మందికి ఫార్వార్డ్ చేసినట్టు గుర్తించామన్నారు. దీన్ని ఇంకా ఎవరైనా ఇతరులతో పంచుకున్నారా అనేది కూడా త్వరలోనే తేలుస్తామన్నారు. అలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య సామరస్యానికి విఘాతం కలిగిస్తాయనీ... ఇకపై ఎవరైనా దీన్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌరవ్ అభిజిత్ హెచ్చరించారు. ‘‘ఈ ఆడియోలో కేంద్రంపై ప్రశ్నలు లేవనెత్తడమే కాకుండా కరోనా వైరస్‌పై తప్పుడు సమాచారం వ్యాప్తిచేస్తున్నారు. దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం..’’ అని ఎస్పీ వెల్లడించారు. 

Updated Date - 2020-04-07T20:41:23+05:30 IST