వరదలతో అసోంలో కుప్పకూలిన వంతెన
ABN , First Publish Date - 2020-06-25T11:28:55+05:30 IST
అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల ఓ వంతెన కుప్పకూలిపోయింది.....

గువాహటి (అసోం): అసోం రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల ఓ వంతెన కుప్పకూలిపోయింది. అసోం రాష్ట్రంలోని టీన్ సుకియా పట్టణంలోని దూమ్ దూమా -భాగ్‌జాన్ రోడ్డు మధ్యలో ఉన్న వంతెన వరదనీటిలో మునిగి కూలిపోయింది. ఈ వంతెన కూలిపోయిన ఘటనలో ఎవరూ గాయపడలేదని డీఎస్పీ బీతుల్ చేతియా చెప్పారు. భాగ్‌జాన్ ప్రాంతంలో ఉన్న ఆయిల్ రిఫైనరీలో ఇటీవల చెలరేగిన మంటలను అదుపుచేయాలంటే ఈ వంతెనపై నుంచే అక్కడకు వెళ్లాలి. వంతెన కూలిపోవడం వల్ల బ్లోఅవుట్ మంటలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. దిబ్రూఘడ్ ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. లోతట్టుప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించింది. వరదల వల్ల పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి.