ఆసియాలో పేదరికంలోకి కోటిమంది..!

ABN , First Publish Date - 2020-04-01T08:49:59+05:30 IST

కరోనావైరస్‌ కారణంగా తూర్పు ఆసియా, ఫసిఫిక్‌ దేశాల్లో కనీసం కోటీ పది లక్షల మంది పేదరికంలోకి జారిపోయే ప్రమాదముందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. మాంద్యం ఖాయమని..

ఆసియాలో పేదరికంలోకి కోటిమంది..!

మాంద్యం ఖాయం.. సుదీర్ఘకాలం కొనసాగే చాన్స్‌

చైనా, భారత్‌ మాత్రం తట్టుకోవచ్చు : ప్రపంచ బ్యాంకు


న్యూయార్క్‌, మార్చి 31: కరోనావైరస్‌ కారణంగా తూర్పు ఆసియా, ఫసిఫిక్‌ దేశాల్లో కనీసం కోటీ పది లక్షల మంది పేదరికంలోకి జారిపోయే ప్రమాదముందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. మాంద్యం ఖాయమని.. అది సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. 2019లో ఆర్ధిక వృద్ధి 5.8 శాతం ఉండగా, 2020లో అది 2.1 శాతానికి మందగించవచ్చని పేర్కొంది. మొత్తం ఆర్థికవ్యవస్థ 0.5 శాతంమేర తగ్గిపోవచ్చని, ఫలితంగా ఎన్నడూ లేని సంక్షోభానికి దారితీయవచ్చని విశ్లేషించింది. నిరుడు 6.1 శాతమున్న వృద్ధి 2.3 శాతానికి తగ్గే అవకాశాలు ఉన్నాయని.. 1976లో మావో జెడాంగ్‌ మృతి తరువాత ఇంత భారీ తగ్గుదల మళ్లీ ఇదే తొలిసారి అని తెలిపింది. కరోనా కల్లోలం నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాలకు ప్రపంచబ్యాంకు 14 బిలియన్‌ డాలర్ల తక్షణ సాయాన్ని ప్రకటించింది. వచ్చే 15 నెలల పాటు వర్థమాన దేశాల్లోని పేదలకు, నిమ్న వర్గాల కోసం మరో 160 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని అందివ్వనున్నట్లు తెలిపింది. కాగా, ఐక్యరాజ్యసమితి కూడా ప్రపంచబ్యాంకు అభిప్రాయంతో ఏకీభవించింది. ఈ ఏడాది ఆర్థికమాంద్యం ప్రపంచాన్ని కమ్మేయడం ఖాయమని ప్రకటించింది. లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లనుందని, దీని ప్రభావం భారత్‌, చైనాలపై పడకపోవచ్చని పేర్కొంది. ఈ నష్టాన్ని తట్టుకునేందుకు కనీసం 2.5లక్షల కోట్ల డాలర్లు అవసరమని ఐక్యరాజ్యసమితి వాణిజ్య విభాగం-అన్‌క్టాడ్‌ కొవిడ్‌-19పై ఇచ్చిన నివేదికలో పేర్కొంది. 

Updated Date - 2020-04-01T08:49:59+05:30 IST