ఎన్నికల కమిషనర్ పదవికి అశోక్ లావాసా రాజీనామా!

ABN , First Publish Date - 2020-08-19T01:23:23+05:30 IST

కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అశోక్ లావాసా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ఎన్నికల కమిషనర్ పదవికి అశోక్ లావాసా రాజీనామా!

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అశోక్ లావాసా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితులను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయన మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాజీనామా సమర్పించినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామా చేయకుండా ఉండి ఉంటే వచ్చే ఏడాది కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టి ఉండేవారు. అయితే ఆయన మనీలాలోని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ పదవిని వచ్చే నెలలో చేపట్టబోతున్న నేపథ్యంలో ఈ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.


అశోక్ లావాసా 1980 బ్యాచ్ హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి. ఎన్నికల కమిషనర్‌గా ఆయన పదవీ కాలం ఇంకా రెండేళ్ళు ఉంది. ఆయన పదవిలో కొనసాగి ఉంటే, ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా స్థానంలో వచ్చే ఏడాది బాధ్యతలు చేపట్టి ఉండేవారు. 


లావాసా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్నత పదవులు నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ వంటివాటిలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌ వైస్ ప్రెసిడెంట్ పదవిని సెప్టెంబరులో చేపట్టబోతున్నారు. మనీలాలో ఈ బ్యాంక్ ఉంది. ఈ విషయాన్ని జూలై 15న ఆ బ్యాంక్ ప్రకటించింది. 


Updated Date - 2020-08-19T01:23:23+05:30 IST